calender_icon.png 8 November, 2025 | 9:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీధిన పడ్డ తల్లి బిడ్డలకు 'సఖి' అండ.!

08-11-2025 07:48:09 PM

మానవత్వంతో స్పందించిన బీజేపీ నాయకుడు..

అక్కున చేర్చుకున్న అధికారులు..

కల్వకుర్తి రూరల్: కట్టుకున్న వాడు దూరమవ్వడంతో కన్నబిడ్డలతో కలిసి ఆ తల్లి వీధిన పడింది. ఆకలి, చలితో నిస్సహాయంగా రోదిస్తున్న ఆ అభాగ్యులను ఓ నాయకుడి మానవత్వం, ప్రభుత్వ యంత్రాంగం సకాలంలో స్పందించిన తీరు అక్కున చేర్చుకున్నాయి. కల్వకుర్తి పట్టణంలోని బస్టాండ్ పరిసరాల్లో ఓ మహిళ ముగ్గురు పసిపిల్లలతో దీనస్థితిలో కనిపించింది. కప్పేర లక్ష్మి(30) భర్త రాములు మరణించడంతో పిల్లలు అనూష(4), కాశీం(3), కన్నయ్య(1)ల భవిష్యత్తు అంధకారంగా మారింది.

వారి దయనీయ పరిస్థితిని గమనించిన కల్వకుర్తి పట్టణ బీజేపీ అధ్యక్షుడు గన్నోజు బాబిదేవ్ వెంటనే స్పందించారు. ఆయన నాగర్‌కర్నూల్ జిల్లా సఖి కేంద్రానికి సమాచారం అందించడంతో అధికారులు హుటాహుటిన రంగంలోకి దిగారు. సఖి కేంద్రం లీగల్ కౌన్సిలర్ టి. సరిత తన సిబ్బందితో కలిసి కల్వకుర్తికి చేరుకుని, లక్ష్మికి ధైర్యం చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం, తల్లితో పాటు ముగ్గురు చిన్నారులను మెరుగైన సంరక్షణ కోసం నాగర్‌కర్నూల్‌లోని సఖి కేంద్రానికి తరలించి సురక్షిత ఆశ్రయం కల్పించారు. ఓ తల్లి కన్నీళ్లను తుడిచి, ఆ పసిమొగ్గలు వాడిపోకుండా అండగా నిలిచిన సఖి కేంద్రం సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.