క్యాటరింగ్ కాంట్రాక్టుల పేరుతో హాస్టల్ యజమానులను మోసం చేస్తున్న నిందితుడి అరెస్ట్
రూ.36.99 లక్షల మోసాలు, 23 కేసులు, 6 సైబర్ ఫిర్యాదుల్లో నిందితుడి ప్రమేయం గుర్తింపు
రూ.13.09 లక్షలు హోల్డ్
వరంగల్, ఆగస్టు 25, విజయక్రాంతి): నకిలీ క్యాటరింగ్ కాంట్రాక్టులు, ఆహార సరఫరా అవకాశాల పేరుతో హాస్టల్ యజమానులను మోసం చేస్తున్న అంతర్ జిల్లా సైబర్ మోసగాడిని హన్మకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు ప్రముఖ ఐటీ కంపెనీ ప్రతినిధిగా పరిచయం చేసుకుని, కంపెనీ ఉద్యోగులకు ఆహారం సరఫరా చేసే క్యాటరింగ్ కాంట్రాక్టులు ఇప్పిస్తానని నమ్మించి పలువురి నుంచి డబ్బులు వసూలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైందని నగర పోలీస్ కమిషనర్ శ్వేత తెలిపారు.
సీపీ తెలిపిన వివరాల ప్రకారం మహమ్మద్ షబ్బీర్ @ కిరణ్ కుమార్ @ శ్రీకాంత్ రెడ్డి @ నర్సింహారెడ్డి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం మల్లక్పల్లి గ్రామానికి చెందిన ఇతను ప్రస్తుతం హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్ రామ్రెడ్డి నగర్లో నివసిస్తున్నాడు. అతని నుంచి 3 మొబైల్ ఫోన్లు, 3 సిమ్ కార్డులు, 2 బ్యాంకు పాస్బుక్స్, 1 చెక్బుక్, 2 ఏ టీ ఏం కార్డులు, 1 డైరీ తదితర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
హన్మకొండ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడిని అరెస్ట్ చేయగా, తెలంగాణ రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన పలు మోసపూరిత కేసుల్లో అతని ప్రమేయం బయటపడిందన్నారు. నిందితుడి నేర విధానం నిందితుడు హాస్టల్ బోర్డులపై ఉన్న మొబైల్ నంబర్లను సేకరించి, వివిధ నంబర్ల ద్వారా హాస్టల్ యజమానులను సంప్రదించేవాడని, తాను ప్రముఖ కంపెనీ ఉద్యోగినని లేదా ప్రతినిధినని పరిచయం చేసుకుని, ఆ కంపెనీ ఉద్యోగులకు ఆహారం సరఫరా చేసేందుకు క్యాటరింగ్ కాంట్రాక్టులు ఇప్పిస్తానని నమ్మించేవాడన్నారు.
అనంతరం అగ్రిమెంట్ ఛార్జీలు, రిజిస్ట్రేషన్ ఫీజులు, క్యాటరింగ్ సామగ్రి కొనుగోలు, ఇతర ఖర్చుల పేరుతో బాధితుల నుంచి డబ్బులు బ్యాంకు ఖాతాలు లేదా యూపీఐ ఖాతాలకు బదిలీ చేయించుకునేవాడని, డబ్బులు అందుకున్న తర్వాత మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం లేదా నంబర్ మార్చడం ద్వారా బాధితులకు అందుబాటులో లేకుండా పోయేవాడన్నారు. కొన్ని సందర్భాల్లో ఇతరుల యుపీఐ ఖాతాలను ఉపయోగించి, అవి కంపెనీ సిబ్బందికి సంబంధించిన ఖాతాలని తప్పుడు సమాచారం ఇచ్చి డబ్బులు బదిలీ చేయించుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైందన్నారు.
వసూలు చేసిన డబ్బులో కొంత మొత్తాన్ని వ్యక్తిగత అవసరాలకు వినియోగించడంతో పాటు, కొంత మొత్తాన్ని ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫారమ్లో కోల్పోయినట్లు పోలీసులు గుర్తించారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో 10 కేసుల్లో నిందితుడి ప్రమేయం గుర్తించబడిందని, అదేవిధంగా ఖమ్మం, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్ జిల్లాల్లో మరో 7 కేసులు వెలుగులోకి వచ్చాయన్నారు. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో మొత్తం రూ.33,33,950 నష్టం జరిగినట్లు గుర్తించగా, రూ.12,40,657 మొత్తాన్ని హోల్ చేశారు.
అదనంగా ఎఫ్ ఐ ఆర్ నమోదు కాకుండా సైబర్ క్రైమ్ పోర్టల్లో నమోదైన మరో 6 ఫిర్యాదుల్లో రూ.3,65,050నష్టం జరిగినట్లు గుర్తించారు. వాటిలో రూ.68,430 హోల్ చేయబడిందని, అన్ని కేసులు, సైబర్ ఫిర్యాదులను కలిపి ఇప్పటివరకు మొత్తం రూ.36,99,000నష్టం జరిగినట్లు గుర్తించగా, రూ.13,09,087 మొత్తాన్ని హోల్ చేయడంలో పోలీసులు సఫలమయ్యారు.ఈ కేసును హన్మకొండ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది సమర్థవంతంగా దర్యాప్తు చేశారు.






