27 July, 2026 | 4:37 AM

దొంగతనాల కేసులో నిందితుడి అరెస్టు

25-09-2025 08:44 PM

చివ్వెంల: చివ్వెంల మండలం కొండలరాయినిగూడెం గ్రామంలో ఇటీవల జరిగిన మూడు వరుస దొంగతనాల కేసును ఛేదించడంలో పోలీసులు విజయం సాధించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు గంపల శ్యామ్ @ శ్యామ్ కుమార్ (23, తండ్రి: ప్రభాకర్) ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు రూరల్ డీఎస్పీ ప్రసన్న కుమార్ వెల్లడించారు.

సమాచారం ప్రకారం, ఈ నెల 22వ తేదీన కొండలరాయినిగూడెం గ్రామంలోని వల్లపు రాణి, కొంపెల్లి జయమ్మ, అల్లి మల్లిక ఇళ్లలో మధ్యాహ్నం సమయంలో దొంగతనాలు జరిగాయి. బాధితుల ఫిర్యాదుల మేరకు చివ్వెంల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా, పోలీసులు బీబీగూడెం గ్రామ శివారులో వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా నిందితుడు గంపల శ్యామ్ పోలీసులకు పట్టుబడ్డాడు. అతడి నుంచి దొంగిలించబడిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

స్వాధీనం చేసుకున్న వస్తువుల వివరాలు:

 * బ్లాక్ కలర్ పల్సర్ బైక్ (TS 29 M 1152)

 * 14.2 గ్రాముల బరువున్న బంగారు నల్లపూసల గొలుసు

 * 1.23 గ్రాముల బరువున్న జూకాలు

 * 274 గ్రాముల బరువున్న మూడు జతల వెండి పట్టీలు

ఈ కేసులో ఇంకా పట్టుబడాల్సిన మిగతా నిందితులను త్వరలో అరెస్టు చేసి, విచారణ పూర్తి చేస్తామని డి.ఎస్.పి. ప్రసన్న కుమార్ తెలిపారు.