25 August, 2026 | 4:29 AM

1/70 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి

25-08-2026 01:11 AM

తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు గోడం గణేష్ డిమాండ్

ఆదిలాబాద్ / ఉట్నూర్, ఆగస్టు 24(విజయక్రాంతి) : చట్టబద్ధత లేకుండా ఎస్టీ జాబితాలోకి చేరిన లంబాడాలపై సమగ్ర విచారణ జరిపి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి తొలగించాలని తుడుం దెబ్బ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు గోడం గణేష్ డిమాండ్ చేశారు.ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటిడిఏ ముట్టడి కార్యక్రమానికి వందలాది ఆదివాసులు తరలివచ్చి ఉట్నూర్ లోని ఆదివాసి భవన్ లో ఆదివాసుల పోరాట వీరుడు కుమ్రంభీమ్‌కు నివాళులర్పించి ఆదివాసి భవన్ నుంచి ఐటీడీఏ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

అనంతరం ఐటీడీఏ కార్యాలయం ముందు ప్రధాన రహదారిపై దాదాపు రెండు గంటల పాటు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తుడుం దెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రావణ్ కుమార్, ఆదివాసీ నాయకులతో కలిసి రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ మాట్లాడారు. 1/70 చట్టాన్ని సవరించాలని సుప్రీంకోర్టులో కేసు వేసిన గిరిజనేతరులపై చర్యలు తీసుకొని ఆదివాసుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వమే సుప్రీంకోర్టులో కౌంటర్ వెయిట్ పిటిషన్ వేయాలని డిమాండ్ చేశారు.

1/70 చట్టాన్ని రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతంలో పకడ్బందీగా అమలు చేయడంతో పాటు గిరిజనేతరుల భూ దురాక్రమాలు, భూ బదలాయింపులను అరికట్టాలని కోరారు.రాష్ట్రంలోని ఐటీడీఏ ప్రాంతాల్లో ప్రత్యేకంగా డీఎస్సీ నిర్వహించాలని తుడుం దెబ్బ రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు.ఉమ్మడి జిల్లా ఆదివాసులు ఐటీడీఏ ముట్టడి కార్యక్రమం చేపట్టడంతో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీతో పాటు జిల్లా అదనపు ఎస్పీ మౌనిక, ఉట్నూర్ ఏఎస్పీ రిత్విక్ సాయి, ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డిల ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.