calender_icon.png 4 September, 2025 | 3:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పత్తి చేనులను ధ్వంసం చేసిన ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలి

01-09-2025 07:38:23 PM

ఐటీడీఏ పిఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, పిఓపి వినసపత్రం ఇచ్చిన న్యూ డెమోక్రసీ నాయకులు

భద్రాచలం (విజయక్రాంతి): చర్ల దుమ్ముగూడెం, ఇతర ప్రాంతాలలో చేతికొచ్చిన పత్తి చేను ధ్వంసం చేసిన ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని, సస్పెండ్ చేయాలని, ఆదివాసీ మహిళలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, సాగు చేసుకుంటున్న భూములకి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం భద్రాచలం ఐటిడిఏ కార్యాలయం ఎదుట, ఫారెస్ట్ అధికారులు ధ్వంసం చేసిన పంటతో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ డివిజన్ కమిటీ(CPI ML New Democracy Division Committee) ఆధ్వర్యంలో  ధర్నా  నిర్వహించారు. అనంతరం ఐటీడీఏ పీవో రాహుల్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి కామ్రేడ్ గౌని నాగేశ్వరరావు, భద్రాచలం డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ లు మాట్లాడుతూ, చర్ల, దుమ్ముగూడెం ఇతర ప్రాంతాలకు చెందిన ప్రజలు సుమారు 30 సంవత్సరాలుగా గడ్డోరు గట్టు, మామిడిగూడెం లాంటి ప్రాంతాలలో వందలాది ఎకరాలలో వేలాది కుటుంబాలు సాగు చేసుకుంటున్నాయి.

అట్టి భూములపై ఇప్పుడు వచ్చిన ఫారెస్ట్ అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వారికి అనుకూలంగా వ్యవహరించడం లేదని, ఆదివాసీలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వారికి చెప్పకుండా  పంటలను ధ్వంసం చేశారని ఆరోపించారు. 30 ఏళ్లుగా ఫారెస్ట్ అధికార కండ్ల ముందే ఆదివాసీలు అట్టి భూములలో సాగు చేసుకుంటున్నారనీ అకస్మాత్తుగా ఫారెస్ట్ అధికారులు రాత్రికి రాత్రి పంట చేనులను ధ్వంసం చేసి చేతికొచ్చిన పంటని భూస్థాపితం చేశారని దీనితో అప్పులు తెచ్చి, ఆలు పుస్తెలు తాకట్టు పెట్టి పంట పెట్టుబడి పెట్టిన రైతులకు చావు తప్ప మరో మార్గం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం పిఓ  మాట్లాడుతూ గురువారం చర్చలు జరుపుదామని సమస్యను పరిష్కరిద్దామని హామీ ఇవ్వటంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాచలం డివిజన్ నాయకులు సూర్యకాంతం,కొండపనేని సత్యనారాయణ,చంద్రం. నష్టపోయిన రైతులు పాల్గొన్నారు.