calender_icon.png 23 December, 2025 | 11:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేజీబీవీ ఎస్ఓలపై చర్యలు తీసుకోవాలి

23-12-2025 09:47:39 PM

జిల్లాలోని కేజీబీవీ ఎస్ఓలను బదిలీ చేయాలి

ఆర్డిఓ లోకేశ్వరరావుకు డివైఎఫ్ఐ,కెవిపిఎస్ నాయకుల వినతి

కుమ్రంభీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయ (కేజీబీవీ) హాస్టళ్లపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ప్రత్యేక అధికారులు (ఎస్‌ఓలు) విద్యార్థుల పట్ల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని డివైఎఫ్ఐ, కెవిపిఎస్ సంఘాల నాయకులు ఆరోపించాయి. జిల్లాలోని కేజీబీవీలలో పనిచేస్తున్న ఎస్‌ఓలు, ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం లేదని, హాస్టళ్లలో మెనూ ప్రకారం భోజనం అందించడం లేదని పేర్కొన్నారు. ఎస్‌ఓలు పెట్టిందే మెనూ అంటూ విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్న పరిస్థితి ఉందన్నారు. అధికారులు హాస్టళ్లకు తనిఖీలకు వచ్చినప్పుడు విద్యార్థులు నిజాలు చెబితే, ఆ విద్యార్థులపై ఒత్తిడి తెచ్చి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయని తెలిపారు. 

ఇటీవల ఆసిఫాబాద్ కేజీబీవీలో సరైన భోజనం అందించకపోవడంతో పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురై వాంతులు చేసుకున్నారని, కొందరికి జ్వరం తీవ్రంగా పెరిగి డెంగ్యూ లక్షణాలతో ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం ఉందన్నారు. ఈ ఘటనను బయటకు రాకుండా ఎస్‌ఓలపై ఉన్నతాధికారులు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అదే విధంగా వారం రోజులకే వాంకిడి కేజీబీవీలో ఎస్‌ఓ విద్యార్థులపై విచక్షణ రహితంగా వ్యవహరిస్తూ బూతులు తిట్టడమే కాకుండా వారి తల్లిదండ్రులపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు విద్యార్థులు ఆరోపించారు.

ఈ పరిస్థితిని తట్టుకోలేక వాంకిడి మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట “ఈ ఎస్‌ఓ మాకొద్దు” అంటూ విద్యార్థులు ధర్నా నిర్వహించినట్లు తెలిపారు. ఈన్ని ఘటనలు జరిగినప్పటికీ జిల్లా విద్యాశాఖ అధికారి, ప్రత్యేక అధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని డివైఎఫ్ఐ, కెవిపిఎస్ నాయకులు విమర్శించారు. వాంకిడి కేజీబీవీలో విద్యార్థులపై అనుచితంగా ప్రవర్తించిన ఎస్‌ఓపై కఠిన చర్యలు తీసుకోవాలని, జిల్లాలోని అన్ని కేజీబీవీ ఎస్‌ఓలను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లతో సోమవారం డివైఎఫ్ఐ, కెవిపిఎస్ సంఘాల ఆధ్వర్యంలో డిఆర్ఓ లోకేశ్వర్‌కు వినతిపత్రం అందజేశారు. జిల్లాలోని కేజీబీవీ ఎస్‌ఓలను బదిలీ చేస్తేనే విద్యార్థులకు న్యాయం జరుగుతుందని వారు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గొడిసెల కార్తీక్, డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు దుర్గ నిఖిల్, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్ తదితరులు పాల్గొన్నారు.