23-12-2025 10:09:41 PM
జర్నలిస్టులందరికీ సమాన న్యాయం అందించాలి
టీడబ్ల్యూజేఎఫ్ నేషనల్ కౌన్సిల్ మెంబర్ చిర్రా శ్రీనివాస్ గౌడ్
మణుగూరు,(విజయక్రాంతి): రాష్ట్రంలో పనిచేస్తున్న చిన్న పత్రికలు, డిజిటల్ మీడియా, పీడీఎఫ్ పత్రిక లతో సహా ప్రతి నిజమైన జర్నలిస్టుకు సమాన న్యాయం జరిగేలా తెలంగాణ మీడియా అక్రెడిటేషన్ రూల్స్ 2025ను ప్రభుత్వం వెంటనే సమీక్షించి సవరించాలని ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (IFWJ) నేషనల్ కౌన్సిల్ మెంబర్ చిర్రా శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన విజయక్రాంతితో మాట్లాడారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 252 తప్పుల తడకగా రూపొందించబడిందని, ఇది కొద్ది మందికే ప్రయోజనం కలిగిస్తూ మెజారిటీగా పనిచేస్తున్న జర్నలిస్టులను అన్యాయానికి గురి చేసేలా ఉందని ధ్వజమెత్తారు.
గ్రామీణ ప్రాంతాల్లో, చిన్న పత్రికల్లో, డిజిటల్ మీడియా, పీడీఎఫ్ పత్రికల ద్వారా ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకొస్తున్న జర్నలిస్టుల భవిష్యత్తును దెబ్బతీసే విధంగా ఈ నిబంధనలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం జారీ చేసిన జీవో 239 కంటే కూడా ఈ జీవో అధ్వాన్నంగా ఉందని, మూలిగే నక్కపై తాటి పండు పడినట్టుగా చిన్న పత్రికల పరిస్థితి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. రెండేళ్లుగా కమిటీల పేరుతో కాలయాపన చేసిన మీడియా అకాడమీ చివరకు సీనియర్ జర్నలిస్టుల అభిప్రాయాలను పక్కన పెట్టి ఈ రూల్స్ రూపొందించడం బాధాకరమన్నారు.
ప్రస్తుతం మీడియా రంగం డిజిటల్ గా మారుతున్న నేపథ్యంలో పీడీఎఫ్ పత్రికలు,వెబ్, మాధ్యమాలు ప్రధాన సమాచార వేదికలుగా మారాయని, వాటిలో నిజాయితీగా పనిచేస్తున్న జర్నలిస్టులను పక్కన పెట్టడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని స్పష్టం చేశారు.అక్రెడిటేషన్ అనేది సంస్థ ఆధారంగా కాకుండా, జర్నలిస్టు చేస్తున్న నిజమైన పని ఆధారంగా ఇవ్వాలి అన్నదే టీడబ్ల్యూజేఎఫ్ ప్రధాన డిమాండ్ అని తెలిపారు.
ఇకనైనా మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి, సమాచార శాఖ మంత్రి పొంగులేటి జర్నలిస్టుల ఆవేదనను అర్థం చేసుకొని జీవో 252ను రద్దు చేయాలని లేదా జర్నలిస్టులందరికీ న్యాయం జరిగేలా సవరించాలని కోరారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా చిన్న పత్రికలు, డిజిటల్, పీడీఎఫ్, జర్నలిస్టులందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతా మని ఆయన హెచ్చరించారు. ప్రతి జర్నలిస్టుకు న్యాయం జరిగే వరకూ టీడబ్ల్యూజేఎఫ్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.