13-10-2025 06:10:34 PM
ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం..
మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణలోని మీ సేవ కేంద్రం నిర్వాహకులు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష పార్టీ నాయకులు, సోషల్ మీడియా వారియర్లు కోరారు. ఈ మేరకు సోమవారం జిల్లాలోని నస్పూర్ లోని సమీకృత కార్యాలయాల భవన సముదాయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా అఖిలపక్ష పార్టీల నాయకులు మాట్లాడుతూ, పట్టణ ప్రాంత ప్రజలకు పౌర సేవల నిమిత్తం మీసేవ కేంద్రానికి వస్తున్న విద్యార్థులు, యువకులు, వృద్ధులను అవహేళన చేస్తూ, ప్రజలతో దురుసుగా ప్రవర్తిస్తూ, ప్రజలకు తెలియని విషయాల గురించి సలహాలు సూచనలు ఇవ్వకపోగా, వారిని బెదిరిస్తూ, సమయపాలన పాటించకుండా మీసేవ కేంద్రం మేనేజర్ ఉపేందర్, ఇంచార్జ్ జనార్దన్ లు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు ఆరోపించారు. దీనిపై జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సానుకూలంగా స్పందించి, విచారణ నిర్వహించి, చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అఖిల పక్ష పార్టీల నాయకులు, యువ నాయకులు ఆకారం రమేష్, బండి శంకర్, సతీష్, కత్తి రమేష్, సోత్కు ఉదయ్, సీపెల్లి సాగర్, రాయబారపు కిరణ్, చిప్పకుర్తి శశిధర్, మహేష్ లు పాల్గొన్నారు.