13-10-2025 08:28:39 PM
పాల్గొన్న యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డీఎస్పీ సైదులు, సీఐ శ్రీనివాస్..
పటాన్ చెరు: పటాన్ చెరు మండలం ఐనోల్, పెద్దకంజర్ల గ్రామాలలో ఎన్ఎస్ఎస్ శీతాకాల ప్రత్యేక శిబిరంలో ఐదవరోజు సోమవారం వాలంటీర్లు యోగాసనాలతో ప్రారంభించి, పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా వాలంటీర్లు ఇంటింటికీ తిరుగుతూ పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేశారు. ప్రజలకు పల్స్ పోలియో చుక్కల ప్రాధాన్యత గురించి వివరించారు. వాలంటీర్లకు వివిధ అంశాలపైన చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లతో పాటు ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ జి.నరసింహులు, డాక్టర్ ఎం.మధుకర్ రావులు పాల్గొన్నారు. మధ్యాహ్నం లయన్ మర్రి ప్రవీణ్ మానసిక వికాసం, వ్యక్తిత్వ వికాసము గురించి విద్యార్థినులకు ఉపన్యాసం ద్వారా యాక్టివిటీ ద్వారా పాజిటివ్ థింకింగ్ అలవర్చుకోవాలని, మానసికంగా బలంగా ఉన్నప్పుడే అనుకున్న లక్ష్యాలను సులభంగా సాధించవచ్చని ప్రేరణ కలిగించారు.
దాదాపు మూడు గంటలు ఎటువంటి విరామం లేకుండా విద్యార్థులను చైతన్యం చేశారు. సాయంత్రం 6 గంటలకు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డీఎస్పీ సైదులు, సీఐ శ్రీనివాస్ బృందం ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ ప్రపంచంలో ఎక్కువ మంది యువత కలిగిన భారతదేశం ఈ సమస్య వల్ల దేశాభివృద్ధి కుంటుపడుతుందని అన్నారు. యువత దేశ నిర్మాణంలో కీలకపాత్ర వహిస్తుందని తెలియజేశారు. కావున ప్రతి ఒక్కరూ ఈ మహమ్మారిని నిర్మూలించడానికి తమ వంతు బాధ్యతను తీసుకోవాలని సూచించారు.