13-10-2025 06:15:46 PM
జిల్లా ఎస్పీ రావుల గిరిధర్..
వనపర్తి టౌన్: ప్రజల భద్రత, క్షేమం దృష్టిలో ఉంచుకొని రాబోయే దీపావళి పండుగను ప్రజలందరూ ఆనందంగా, సురక్షితంగా జరుపుకోవాలని వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ... దీపావళి పండుగ సందర్భంగా బాణాసంచా విక్రయాల కోసం డివిజినల్ స్థాయి పోలీసు అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా బాణాసంచా నిల్వ చేసిన, తయారుచేసిన, దుకాణాలను నెలకొల్పిన, సరైన భద్రతా ప్రమాణాలు లేకుండా విక్రయాలు జరిపినా, ప్రేలుడు పదార్థాల చట్టం-1884, రూల్స్-1933 సవరణ 2008 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
దీపావళి పండుగ సందర్భంగా వనపర్తి జిల్లా పరిధిలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా టపాసుల విక్రయ దుకాణాలు రద్దీ ప్రదేశాలు, ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాలు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు లేదా పెట్రోల్ బంకులు సమీపంలో వివాదాస్పద స్థలాలలో ప్రజలు నివసించే ప్రాంతాలలో ఏర్పాటు చేయకుండ సంబంధిత అధికారులు తహసీల్దార్, ఫైర్ విభాగం, పోలీసుశాఖ సూచించిన ప్రదేశాల్లో మాత్రమే లైసెన్స్ ఉన్న వ్యాపారులు బాణసంచ విక్రయాలను తగు జాగ్రత్తలు తీసుకొంటూ జరుపుకోవాలని ఎస్పీ తెలిపారు.
బాణసంచా దుకాణాదారులు తప్పక ఈ క్రింది నిబంధనలు పాటించాలి:
-టపాకాయల దుకాణాలు ఖాళీ ప్రదేశాలలో నెలకొల్పవలెను. ఖాళీ ప్రదేశానికి సంబంధించిన ఎన్.ఓ.సి సర్టిఫికేటు పొందపర్చాలి.
-ఒక క్లస్టర్ లో 50 షాపులకు మించరాదు.
-జనరద్దీగల ప్రదేశాలలో ఎలాంటి టపాకాయల షాపుల ఏర్పాటు చేయరాదు.
-జనవాసాలు లేని బహిరంగ ప్రదేశాలలో మాత్రమే టపాకాయల షాపుల ఏర్పాటు చేసుకోవాలి.
-దుకాణాల సమీపంలో ఇసుక, నీరు, రెండు ఫైర్‌ఎక్స్‌ట్రిమిషన్‌లు ఉంచాలని సూచించారు.
-బాణసంచా విక్రయించే వ్యాపారులతో పాటు టపాకాయలు కాల్చే ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు పాటించాలి.
-టపాసుల దుకాణానికి నిర్ధేశిత రుసుము చెల్లించి. విధ్యుత్, ఫైర్ శాఖతో పాటు మున్సిపల్ శాఖల NOC అనుమతి తప్పనిసరి.
-ఈ లైసెన్సులు 3 రోజుల కోసం మాత్రమే వర్తిస్తాయి.
-200 లీటర్ల వాటర్ బ్యారల్. నాలుగు ఇసుక బకెట్లు, నీటి బకెట్లను ఏర్పాటు చేసుకోవాలి.
-దుకాణంలో ల్యాంప్‌లు, పెట్రోమ్యాక్స్‌లు పాత కరెంట్ తీగలు ఉంచరాదు. జాయింట్ కేబుల్స్ వాడవద్దు.
-జనరేటర్ 15 నుంచి 20 మీటర్ల దూరంలో ఉండాలి.
-దుకాణంలో 18 సంవత్సరాల వయస్సు నిండిన వారే పనిచేయాలి.
-గోదాం ఊరికి 5 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేసుకోవాలి.