విద్యాశాఖ కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలి
యూఎస్పీసీ, జాక్టో ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్
హైదరాబాద్, మే 4 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతుల సంక్షోభానికి కారణమైన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) వివాదం పరిష్కారంపై పాఠశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేన నిర్లక్ష్యాన్ని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ), ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రధానోపాధ్యాయుల పదోన్నతులకు టెట్ అవసరం లేదని పేర్కొంటూ ఏప్రిల్ 8న పాఠశాల విద్యాశాఖకు ఎన్‌సీటీఈ (జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి) రాసిన లేఖను బహిర్గతం చేయకుండా దేవసేన దాచిపెట్టారని ఆరోపించారు. అందరూ టెట్‌కు దరఖాస్తు చేసుకునేలా చేసిన కమీషనర్‌పై చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు కె.జంగ య్య, చావ రవి, జి.సదానందం గౌడ్, ఎం.పర్వత రెడ్డి, కె.కృష్ణుడు శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
ఏ క్యాడర్ పదోన్నతులకు టెట్ అవసరమో ఎన్‌సీటీఈ నుండి వివరణ తీసుకోవాలని టీచర్ సంఘాలు పలుమార్లు విజ్ఞప్తి చేయడంతో ఫిబ్రవరి 14న పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎన్సీటీఈని వివరణ కోరుతూ లేఖ రాశారని, అయితే ఈ లేఖపై స్పష్టతనిస్తూ కమీషనర్ దేవసేన పేరిట ఎన్సీటీఈ సెక్రటరీ రవీంద్ర సింగ్ ఏప్రిల్ 8న మెయిల్ ద్వారా బదులు పంపినట్లు స్పష్టం చేశారు. అయితే, ఈ విషయంపై తాము పదేపదే అడిగినప్పటికీ ఎలాంటి లేఖ రాలేదని కమీషనర్ చెప్పినట్లు వారు పేర్కొన్నారు. కనీసం ఎన్సీటీఈకి రాసిన లేఖ ఇవ్వాలని కోరినప్పటికీ లేక ఇవ్వకుండా దాచిపెట్టారని ఆరోపించారు. అయితే, ఇదే విషయంపై ఎన్సీటీఈ మెంబర్ కార్యదర్శిని ఇటీవల కలిసి వివరణ కోరగా ఏప్రిల్ 8వ తేదీనే లేఖపై స్పష్టత ఇచ్చామంటూ తమకు కాపీని అందజేయడంతో విస్తుపోయామన్నారు. వచ్చిన లేఖను వెల్లడించకుండా టెట్‌కు దరఖాస్తు చేయించటం ద్వారా ఉపాధ్యాయుల లక్షల రూపాయలు వృథా చేయించారని మండిపడ్డారు. ఎన్నికలు ముగిసిన వెంటనే పదోన్నతులు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.




