27 March, 2026 | 5:56 AM

విద్యాశాఖ కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలి

17-05-2024 12:46 AM

టీచర్లను గందరగోళానికి గురిచేశారు

విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశంకు ఫిర్యాదు

హైదరాబాద్, మే 16 (విజయక్రాంతి): టెట్ విషయంలో సరైన సమాచారాన్ని అందించకుండా ఉపాధ్యాయులను గందరగోళానికి గురిచేసిన పాఠశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేన, అదనపు సంచాలకులు లింగయ్యపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పీర్టీయూటీఎస్ (ప్రొగ్రెస్సివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర సచివాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంను గురువారం కలిసి యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగలి శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు ఫిర్యాదు చేశారు. పాఠశాల విద్యాశాఖ కార్యాలయంలో ఉపాధ్యాయులకు అందుబాటులో ఉండకుండా, టీచర్ల సమస్యలను పట్టించుకోకుండా పలు అక్రమాలకు పాల్పడిన అధికారులపై విచారణ చేపట్టి వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.

బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేయాలి

గతంలో నిలిచిపోయిన బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను వెంటనే చేపట్టాలని వెంకటేశంను పీఆర్టీయూ టీఎస్ సంఘం నేతలు కోరారు. టెట్‌తో నిమిత్తం లేకుండా ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్‌లకు పదోన్నతులు కల్పించాలని వారు కోరడంతో దానికి ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఆయనను కలిసినవారిలో ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, పీఆర్టీయూటీఎస్ నేతలు ఇన్నారెడ్డి, రామేశ్వర్‌గౌడ్ తదితరులు ఉన్నారు.