27 March, 2026 | 3:53 AM

కామారెడ్డి వైద్యశాఖాధికారి అరెస్ట్

17-05-2024 12:47 AM

లైంగిక వేధింపుల కేసులో చర్యలు 

ఎస్పీ ఆదేశాలతో రిమాండ్‌కు తరలింపు

కామారెడ్డి, మే 16 (విజయక్రాంతి): మహిళా వైద్యులపై లైంగిక వేధింపులకు పాల్పడిన కామారెడ్డి జిల్లా వైద్యశాఖాధికారిని గురువారం పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు పంపారు. డీఎంహెచ్‌వో లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ ఈ నెల 8న జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న 20 మంది మహిళా వైద్యాధికారులు జిల్లా కలెక్టర్‌కు, ఎస్పీకి, స్థానిక ఎమ్మెల్యేకు, రాష్ట్ర వైద్యశాఖాధికారులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. జిల్లా వైద్యశాఖ కార్యాలయం సూపరింటెండెంట్ శ్రీనివాస్‌నాయక్ ఓ మహిళా వైద్యాధికారికి ఎస్‌ఎంఎస్ ద్వారా లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.

ఈ విషయంపై రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సీరియస్ అయ్యారు. జిల్లా వైద్యాధికారిపై చర్యలకు జిల్లా ఎస్పీ సింధుశర్మకు ఆదేశాలు జారీ చేశారు. ఎస్పీ సింధు శర్మ ఆదేశాల మేరకు  జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్‌సింగ్‌పై సెక్షన్ 354, 354 (డి), 509 కింద ఏడు కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్టు దేవునిపల్లి రూరల్ సీఐ రామన్ తెలిపారు. బుధవారం రాత్రే అదుపులోకి తీసుకొని విచారించినట్టు తెలుస్తుంది.