తెలంగాణకు ఏపీ నేతల వలస
ప్రాణభయంతో పారిపోయి వస్తున్న నేతలు
ఎన్నికలు ముగిసినా మండుతూనే ఉన్న ఏపీ
టీడీపీ, వైసీపీ శ్రేణుల దాడులు ప్రతిదాడులు
పోలీసులనూ వదలకుండా తరుముతున్న వైనం
అల్లర్ల నివారణకు రంగంలోకి పారామిలిటరీ
గేలి చేసిన తెలంగాణనే నేడు ఏపీ నేతలకు దిక్కు
శాంతికి తెలంగాణ చిరునామా అని ప్రశంసలు
రాష్ట్రం మండుతుంటే విదేశాల్లో విహారానికి ఏపీ నేతలు
హైదరాబాద్, మే 16 (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తీవ్ర హింస చెలరేగటంతో చాలామంది నేతలు తెలంగాణబాట పట్టారు. సొంత రాష్ట్రంలో ఉంటే ప్రాణాపాయం ఉన్నవారు హైదరాబాద్‌లో రహస్యప్రాంతాల్లో తలదాచుకొనేందుకు మూడోకంటి కి తెలియకుండా వచ్చేస్తున్నారు. వారిలో తెలంగాణ ఉద్యమాన్ని, రాష్ట్రాన్ని తీవ్రంగా అపహాస్యం చేసినవారు కూడా ఉండటం గమనార్హం.
ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా రాజకీయ హింస ఆగలేదు. ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలు పరస్పరం నాటు బాంబులు, వేట కోడవళ్లతో దాడులు చేసుకొంటూ స్వైర విహారం చేస్తున్నారు. ప్రత్యర్థి కనిపిస్తే వెంటబడి ప్రాణాలు తీస్తున్నారు. అడ్డువచ్చిన పోలీసులను సైతం వదలకుండా దాడులు చేస్తున్నారు. తెలంగాణలో ప్రశాంతంగా ఉండటంతో ప్రాణాపాయం ఉన్న ఏపీ నేతలు కొంతకాలం ఇక్కడ తలదాచుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
తెలంగాణలో ఇలా.. ఏపీలో అలా
తెలంగాణలోనూ ఏపీతోపాటే లోక్‌సభ ఎన్నికలు ఈ నెల ౧౩న జరిగాయి. గత రెండు నెలలుగా తీవ్ర విమర్శలు గుప్పించుకొన్న తెలంగాణలోని వివిధ పార్టీల నేతలు పోలింగ్ ముగిసిన వెంటనే సాధారణ స్థితిలోకి వచ్చేశారు. హైదరాబాద్‌లో సేదదీరుతూ వ్యాపారాలు చక్కబెట్టుకొంటున్నారు. మొన్నటివరకు శత్రువుల్లా ఉన్నవారు కూడా ఇప్పుడు ఒకే టేబుల్‌పై మందు తాగుతూ ముచ్చట్లు చెప్పుకొంటున్నట్టు వినికిడి. ఏపీలో మాత్రం ఇంకా వేటకత్తుల చప్పుడు వినిపిస్తూనే ఉన్నది. కర్రలు, కత్తలు పట్టుకొనే తిరుగుతున్నారు. టీడీపీ, వైసీపీ నాయకుల యుద్ధ వాతావరణం కొనసాగుతున్నది.
కారంచేడు, చిత్తూరు, తాడిపత్రి, అనంతపురం, ప్రకాశం జిల్లాలో హింస పేట్రేగిపోతుంది. అల్లరి మూకలు పోలీసులను కూడా వెంటపడి తరిమికొడుతున్నారు. చివరికి నాయకులు సొంత నియోజకవర్గంలో ఉండలేని పరిస్థితి నెలకొంది. పోలీసులు శాంతి భద్రతలను అదుపు చేయలేక చేతులెత్తేయటంతో పారా మిలిటరీని రంగంలోకి దింపారు. దీంతో రక్షణ కోసం నేతలు తలదాచుకోవడానికి పక్క రాష్ట్రాలకు పారిపోతున్నారు. తాడిపత్రి నియోజకవర్గానికి చెందిన జేసీ దివాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు జేసీ వవన్‌కుమార్ రెడ్డితో పాటు వారి కుటుంబ సభ్యులను పోలీసులు గట్టి భద్రత మధ్య హైదరాబాద్‌కు పంపించారు.
జేసీ ప్రభాకర్‌రెడ్డి భార్య, సోదరి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. జేసీ దివాకర్‌రెడ్డి సహాయకులను ఇంట్లోకి పంపించేందుకు పోలీసులు అంగీకరించడం లేద న్న విషయం తెలుసుకున్న దివాకర్‌రెడ్డి తనయు డు పవన్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్ నుంచి తాడిపత్రి వచ్చారు. పవన్‌ను కూడా పోలీసులు ఇంట్లో కి వెళ్లేందుకు అనుమతించలేదు. దీంతో కన్నతల్లి అనారోగ్యంతో ఉంటే చూడకుండా అడ్డుకుంటారా? అని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. దాంతో పవన్‌కూమార్‌రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. తాడిపత్రిలో ఉండటానికి వీల్లేదని తేల్చి చెప్పారు.
శాంతికి చిహ్నం తెలంగాణ
తెలంగాణలో ఎప్పడు ఎన్నికల జరిగినా చిన్నచిన్న మాటల యుద్ధం తప్ప గొడవలు జరిగిన సందర్భాలు లేవు. ఎన్నికలు ముగిసిన మరుక్షణం మాటల యుద్ధం కూడా టక్కున ఆగిపోతుంది. తీవ్ర విమర్శలు గుప్పించుకొన్న నేతలు కూడా ఎదురుపడితే నవ్వుతూ ఆప్యాయంగా పలకరించుకొంటారు. అందుకే దేశం నలుమూలల నుంచి అన్ని భాషలు, వర్గాల ప్రజలు తెలంగాణలో నివసించేందుకు తరలివస్తుంటారు.
ఏపీతోపాటు ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, గుజరాత్, ఒడిశా, కోల్‌కతా, మధ్యప్రదేశ్, తమిళనాడుకు చెందిన పేద, మధ్య తరగతి ప్రజలకు తెలంగాణ జీవనాధారంగా మారింది. ఏ రాష్ట్రవారితో అయినా తెలంగాణ ప్రజలు ఇట్టే కలిసిపోటం కూడా ఇక్కడి శాంతియుత వాతారణానికి ఒక కారణమని సామాజికవేత్తలు చెప్తున్నారు. రాజకీయ నాయకులు కూడా ఎన్నికల సందర్భాల్లో తప్ప మిగతా సమయంలో ఆర్థిక సంబంధాలు, కుటుంబ సంబంధాలు మెరుగుపరుచుకుంటూ తెలంగాణకు కొత్త వన్నె తెస్తున్నారు. రాజకీయాలు పక్కనపెట్టి రాష్ట్రంకోసం పనిచేస్తున్నారు.
దీంతో తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణవారికి పాలన తెలియదని ఎద్దేవా చేసిన ఏపీ నాయకులే ఇప్పుడు సొంత రాష్ట్రంలో రక్షణ లేక తెలంగాణలో తలదాచుకొనేందుకు వస్తున్నారు. తెలంగాణ ప్రశాంతతకు మారు పేరుగా నిలిచిందని ప్రశంసిస్తున్నారు. వెనకబడుతుందని భావించిన తెలంగాణ అన్ని రంగాల్లో మేటిగా నిలిచి ప్రజాస్వామ్యానికి వెలుగులు నింపుతుందని పలువురు ఏపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. టీడీపీ, వైసీపీ నాయకులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఏపీ సామాన్య జనం తిట్టిపోస్తున్నారు.
స్విట్జర్లాండ్‌కు జగన్.. మహారాష్ట్రకు బాబు
ఒకవైపు తమ పార్టీ కార్యకర్తలు అల్లర్లు, గొడవల్లో తలమునకలై తలలు పగులగొట్టుకొంటుం టే.. పరిస్థితులను చక్కబెట్టాల్సిన ఆయా పార్టీల అగ్రనేతలు ఏమీ పట్టనట్టు విదేశాలకు, ఇతర రాష్ట్రాలకు విహారయాత్రలకు బయలుదేరుతున్నారు. ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి యూరప్ పర్యటనకు వెళ్తున్నారు. తన పర్యటనకు సీబీఐ నుంచి అనుమతి కూడా తీసుకున్నారు.
శుక్రవారం నుంచి జూన్ 1 వరకు ఫ్రాన్స్, స్విట్జర్లాండ్‌లో కుటుంబసమేతంగా పర్యటించనున్నారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్ కూడా భార్య అన్నా లెజ్నెవాతో కలిసి విదేశాలకు వెళ్లనున్నారని తెలిసింది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు. సతీమణి భువనేశ్వరితో కలిసి గురువారం ఆయన మహారాష్ట్రలో పర్యటించారు. కొల్హాపూర్‌లోని శ్రీ మహాలక్ష్మి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం షిరిడీ సాయినాధుని దర్శనం చేసుకొన్నారు.




