12-12-2025 12:00:00 AM
ప్రభుత్వానికి నటుడు ఎస్వీ రంగారావు మనవడు విజ్ఞప్తి
ఖైరతాబాద్, డిసెంబర్ 1౧ (విజయక్రాంతి): ఫోర్జరీ సంతకాలతో తమ ఇంటిని కబ్జా చేయడమే కాక అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని అలనాటి నటుడు ఎస్ వి రంగారావు మనవడు రంగారావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో న్యాయవాది అంజన్‌గౌడ్‌తో కలిసి ఆయన మాట్లాడారు.. మాసబ్ ట్యాంక్ శాంతినగర్ లోని 1966వ సంవత్సరంలో 446 చదరపు అడుగుల స్థలాన్ని తమ తాత ఎస్వి రంగారావు కొనుగోలు చేశారని చెప్పారు.
సదరుస్థలంలో నిర్మించిన ఇంటిని 1995లో శ్రీనివాస్ అనే వ్యక్తికి లీజుకు ఇచ్చామని తెలిపారు. శ్రీనివాస్ తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా 2007లో తమసంతకాలను ఫోర్జరీ చేసి తప్పుడు పత్రాలను సృష్టించి సదరు ఇంటిని స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. మున్సిపల్ టాక్స్ చెల్లించేందుకు వెళ్లిన తమకు విషయం తెలవటంతో ఆశ్చర్యపోయామని అన్నారు. తక్షణమే ఈ విషయంపై న్యాయ స్థానాన్ని ఆశ్రయించగా ఆదేశాలు జారీ చేసిందని చెప్పారు. ఈ వివాదం కొనసాగుతుండగానే ఇంటి ని కూల్చివేసి నూతన నిర్మాణాలు చేపట్టారని చెప్పారు.
దీనిపై న్యాయస్థానాన్ని తిరిగి ఆశ్రయించగా సదరుసలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయాలని పలుమార్లు ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయిందని అన్నారు. తాము న్యాయం కోసం పోరాడుతుండగా అనేక అక్రమాలకు పాల్పడి కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తికి పోలీసులు మద్దతు పలకడమే కాక అడిషనల్ డిసిపి స్థాయి అధికారి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఈ అంశంలో ప్రత్యేక దృష్టి సారించి విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు.