21-11-2025 09:47:52 PM
* రైతుల పంటనష్టంపై వెంటనే చర్యలు
* ప్రతి కుటుంబానికి న్యాయం జరిగే విధంగా చర్యలు
* నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్
అచ్చంపేట: ఎస్ఎల్బీసీ జలాశయంలో భాగంగా నిర్మిస్తున్న నక్కల గండి ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం అండగా ఉంటుందని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ స్పష్టం చేశారు. శుక్రవారం అచ్చంపేట మండల పరిధిలోని మర్లపాడు తండా గ్రామాన్ని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, అదనపు కలెక్టర్ పి అమరేందర్, అధికారులతో కలిసి సందర్శించి గ్రామ ప్రజలతో సమావేశమయ్యారు.
నక్కలగండి ప్రాజెక్టు ముంపు ప్రభావానికి గురయ్యే నక్కలగండి తండా, మర్లపాడు తండా, కేశ్య తండా, మన్నేవారిపల్లి గ్రామాల ప్రజలకు పునరావాసం మరియు పునర్నిర్మాణం ప్రక్రియను వేగవంతం చేయడానికి జిల్లా యంత్రాంగం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ప్రకటించారు. ముంపు ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించిన కలెక్టర్, అక్కడి ప్రజలతో సమావేశమై వారి అవసరాలు, అభిప్రాయాలు, పునరావాసంపై ఉన్న సందేహాలను వివరంగా తెలుసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ప్రత్యక్ష ఆదేశాల మేరకు తాము ఈ ప్రాంతానికి వచ్చి ముంపు ప్రభావం, పునరావాస పనులు, పంట నష్టాలను పరిశీలిస్తున్నామని కలెక్టర్ వెల్లడించారు.
ప్రభుత్వానికి ప్రజల సంక్షేమమే ముఖ్యమని, ముఖ్యమంత్రి సూచనల ప్రకారం ప్రతి కుటుంబం, ప్రతి రైతు, ప్రతి తండాకు న్యాయం జరిగేలా యంత్రాంగం పనిచేస్తుందని గ్రామస్థులకు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. తండాల్లో నివసిస్తున్న ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా ప్రభుత్వంతో నిరంతరం చర్చలు జరిపి, తమ పరిధిలో చేయాల్సిన పనులను ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా పూర్తిగా అమలు చేస్తానని హామీ ఇచ్చారు. పునరావాసానికి సంబంధించిన ప్రతీ పని పారదర్శకంగా, వేగంగా జరిగేలా స్వయంగా పర్యవేక్షిస్తానని తెలిపారు. ప్రజలు ప్రధానంగా తమ భవిష్యత్ నివాస స్థలం సౌకర్యాలతో ఉండాలని, పునరావాస చర్యలు ఆలస్యం కాకూడదని, విద్య, ఆరోగ్య, రవాణా వంటి మౌలిక వసతులు సమీపంలో ఉండాలని కోరినట్లు పేర్కొన్నారు.
ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ప్రతీ అర్హుడికి తప్పకుండా వర్తించే విధంగా కృషి చేస్తానని స్పష్టం చేశారు. ప్రజల కోరికలకు అనుగుణంగా అనువైన స్థలాన్ని ఎంపిక చేయడానికి ప్రభుత్వం అందుబాటులో ఉన్న భూములను పరిశీలిస్తోందని కలెక్టర్ తెలిపారు. ప్రస్తుత ప్రాంతంలో సరిపడ ప్రభుత్వ భూమి అందుబాటులో లేకుంటే, అచ్చంపేట సమీపంలోని హాజీపూర్ వద్ద ఇప్పటికే గుర్తించిన ప్రత్యామ్నాయ భూమిలో పూర్తి స్థాయి పునరావాస కాలనీలను నిర్మించడానికి యంత్రాంగం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు.
పునరావాస కాలనీలు కేవలం ఇండ్ల నిర్మాణం మాత్రమే కాకుండా, నీటి సౌకర్యం, విద్యుత్, అంతర్గత రహదారులు, డ్రెయినేజ్ వ్యవస్థ, స్ట్రీట్ లైటింగ్, కమ్యూనిటీ హాల్స్ వంటి అన్ని మౌలిక వసతులతో రూపుదిద్దుకునేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇందుకోసం భూ సర్వే పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, నిర్మాణాల రూపకల్పన సిద్ధం అవుతోందని, సంబంధిత నిర్మాణ సంస్థలతో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. పునరావాసానికి సంబంధించి మరిన్ని సదుపాయాలను కల్పించేందుకు ప్రత్యేక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపనున్నామని చెప్పారు. పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, తాగునీటి పథకాలు వంటి సేవలను కూడా కొత్త కాలనీల్లో ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.
అలాగే మర్లపాడు గ్రామ ప్రజలు సంక్షేమ పథకాలు అందటంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించగా, అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి తప్పకుండా అందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. డబుల్ బెడ్రూం ఇండ్లు, ఆరోగ్య పథకాలు, రైతు బంధు, పెన్షన్లు వంటి పథకాలు ప్రతి అర్హుడికి అందేలా ప్రత్యేక పర్యవేక్షణ చేపడతామని చెప్పారు. ముంపు ప్రాంత గ్రామాల పునరావాసం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతైన అంశమని, గ్రామస్థులకు ఎలాంటి నష్టం లేకుండా ప్రతి కుటుంబం సురక్షితమైన కొత్త ప్రాంతంలో మెరుగైన వసతులతో కొత్త జీవితం ప్రారంభించేలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తాయని తెలిపారు.
పునరావాసం పూర్తయ్యే వరకు ప్రభుత్వం ప్రజల వెంటే నిలుస్తుందని భరోసా ఇచ్చారు. అంతకుముందు నక్కలగండి ప్రాజెక్టు నుండి విడుదలైన నీటి ప్రవాహం మరియు ఇటీవల జిల్లాలో కురిసిన భారీ వర్షాల ప్రభావాన్ని కూడా కలెక్టర్ ప్రత్యక్షంగా పరిశీలించారు. పత్తి, వరి వంటి ముఖ్య పంటలు పెద్దఎత్తున తడిసి దెబ్బతిన్న ప్రాంతాలను సందర్శించి, రైతులతో మాట్లాడి వారి సమస్యలను వివరంగా తెలుసుకున్నారు. రైతులు ఎదుర్కొంటున్న నష్టాల స్థాయిని సమగ్రంగా అంచనా వేసి, రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి వివరాలతో నివేదికలు పంపినట్లు కలెక్టర్ తెలిపారు. పంట నష్టం వల్ల రైతులు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకునే చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు.
నష్టపోయిన పంటలకు పంటనష్టం పరిహారం అందేలా ప్రత్యేక నివేదికలు పంపించామని, రైతులకు తక్షణ ఉపశమనం కలిగించే చర్యలను ప్రభుత్వం త్వరగా అమలు చేస్తుందనే, వర్షాలు, వరదలతో ప్రభావితమైన ప్రతి రైతుకూ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. వ్యక్తిగత వ్యాపారాలు, చిన్న వ్యాపారాల వల్ల నష్టపోయిన వారు కూడా స్వయంగా వచ్చి తమ సమస్యలను వివరించాలని కలెక్టర్ సూచించారు. జిల్లా కలెక్టర్ వెంట అచ్చంపేట ఆర్డీవో మాధవి, అచ్చంపేట తాహసిల్దార్ సైదులు, వివిధ శాఖల అధికారులు ఆయా ముంపు గ్రామాల ప్రజలు తదితరులు ఉన్నారు.