సేఫ్టీ నిబంధనలు పాటించకుంటే చర్యలు
మాజీ కార్పొరేటర్ ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి
రంగారెడ్డి, ఆగస్టు 6(విజయక్రాంతి): నిర్మాణ పనుల్లో కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా ప్రమాదాలకు కారణమవుతున్న డెవలపర్స్పై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని కృష్ణవేణి నగర్లో ’మహాలక్ష్మి డెవలపర్స్’ నిర్మిస్తున్న భారీ భవనం సెల్లార్ తవ్వకాల సమయంలో సేఫ్టీ నిబంధనలుపాటించకపోవడంతో, పక్కనే ఉన్న శ్రీ అంబికా రెసిడెన్సీ అపార్ట్మెంట్ ప్రహరీ గోడ కూలిపోయింది.
ఈ ప్రమాదంతో ఆందోళనకు గురైన అపార్ట్మెంట్ నివాసితుల పిలుపుమేరకు ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి, కూలిన ప్రహరీని వెంటనే పునర్నిర్మించాలని బిల్డర్లను డిమాండ్ చేశారు. అనంతరం బాధితులు ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ వికాస్ మహతోకు ఫిర్యాదు చేయగా, ఆయన ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ అర్చన స్థలాన్ని పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘించిన డెవలపర్స్పై సమగ్ర నివేదిక తయారు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.






