7 August, 2026 | 3:25 AM

జయశంకర్ జీవితాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలి

07-08-2026 02:31 AM

నేటి తరానికి జయశంకర్ జీవితం ఆదర్శం

తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన పాత్ర గొప్పది

జయశంకర్ జయంతి సభలో ప్రొఫెసర్ జి.హరగోపాల్

తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో ఘనంగా జయంతి సభ

పాలకుల్లో మార్పుకు జెన్-జీ ఉద్యమం దోహదం

దేశంలో భయానక వాతావరణం ఆందోళన కరం

జెన్-జీ ఉద్యమం తిరుగుబాటు తత్వాన్ని నేర్పింది: ప్రొ.కె.నాగేశ్వరరావు

ఎమ్మెల్సీ దేశాపతి శ్రీనివాస్ సహా పలువురు ప్రముఖుల హాజరు

ముషీరాబాద్, ఆగస్ట్ 6 (విజయక్రాంతి): మానవతా విలువలు క్షీణిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో నేటి తరానికి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జీవితం అని ప్రొఫెసర్ జి.హరగోపాల్ అన్నారు. ఉద్యమ నిర్మాణం, నిజాయితీ, నైతిక విలువలను తెలియజేసేందుకు ఆయన జీవితాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు.

గురువారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ వికాస సమితి అధ్యక్షుడు వనపట్ల సుబ్బయ్య అధ్యక్షతన నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హరగోపాల్ మాట్లాడుతూ జయశంకర్ లాంటి వ్యక్తుల జీవితాలను విద్యార్థులకు పరిచయం చేస్తే విలువలతో కూడిన సమాజ నిర్మాణానికి దోహద పడుతుందని అన్నారు. తెలంగాణపై పరిశోధనలు చేసి గణాంకాలతో రాష్ట్ర సాధన ఉద్యమానికి దిశా నిర్దేశం చేసిన మహనీయుడు జయశంకర్ అని కొనియాడారు.

చివరి శ్వాస వరకు తెలంగాణ కోసం పోరాడిన ఆయనను ప్రజలు ఎన్నటికీ మరచిపోరని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలను చైతన్య పరచడంలో జయశంకర్ కీలక పాత్ర పోషించారని, నేడు దేశంలో భయానక వాతావరణం నెలకొందని హరగోపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో జరిగిన జెన్-జీ ఉద్యమం పాలకుల్లో మార్పుకు దోహదపడిందని, ప్రజల్లో భయాన్ని కొంతవరకు తొలగించిందని అభిప్రాయపడ్డారు.

’జెన్-జీ ఉద్యమం ప్రభావా లు - పరిణామాలు’ అంశంపై ప్రొఫెసర్ కె. నాగేశ్వరరావు మాట్లాడుతూ ఢిల్లీలో విద్యార్థులు, యువత చేపట్టిన ఉద్యమం సమాజా నికి తిరుగుబాటు తత్వాన్ని నేర్పిందన్నారు. ఉద్యమంలో ఆక్రోశం, ఆవేదన, ప్రతిఘటన దాగి ఉన్నాయని, దేశ ఆర్థిక వ్యవస్థలో అసమానతలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. పాలకులను ప్రశ్నిస్తే వేధింపులు, అక్రమ కేసులు ఎదురవుతున్నాయని విమర్శించా రు. ధర్మం ముందు ఎంతటి శక్తివంతుడైనా నిలవలేడని, విద్యార్థి ఉద్యమాలు సమాజ మార్పుకు దోహద పడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు కె.విరహత్ అలీ, గ్రంథాలయ పరిషత్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అయాచితం శ్రీధర్, మల్లోజుల విజయ్ తదితరులు పాల్గొన్నారు.