9 July, 2026 | 11:59 PM

భూముల అన్యాక్రాంతంపై చర్యలు తీసుకోవాలి

11-06-2024 12:05 AM

నిర్మల్, జూన్ 10 (విజయక్రాంతి): నిర్మ ల్ జిల్లా లోకేశ్వరం మండలం గడ్‌చాందలో శ్రీరాంసాగర్ ముంపు భూములను ఆక్రమించుకొని వ్యవసాయం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు సోమవారం కలెక్టర్ ఆశీష్‌సంగ్వాన్‌కు వినతి పత్రం అందించారు. తమ గ్రామం 1983లో ప్రాజెక్టులో  ముంపునకు గురయ్యిందని, ఈ భూములకు పరిహారం చెల్లించారని కలెక్టర్‌కు విన్నవించారు. 200 ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయని, ఆ భూముల్లో రైతులు తిరిగి వ్యవసాయం చేస్తున్నారని తెలిపారు. 20 ఏళ్లనుంచి తాము పశువులు మేపుతుంటే ఇప్పుడు పశువులు రాకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ భూములపై విచారణ చేపట్టి చర్యలు తీసుకొంటామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు గ్రామస్థులు తెలిపారు.