ఐఎంజీ భారత్ కేసులో ప్రతివాదిగా చేర్చండి
మాజీ మంత్రి పీ రాములు ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు
హైదరాబాద్, జూన్ 14 (విజయక్రాంతి): క్రీడల అభివృద్ధి పేరుతో ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌లో ఖరీదైన భూముల కేటాయింపు, స్టేడియంల నిర్వహణ బాధ్యతను ఐఎంజీ భారత్ అకాడమీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఇవ్వడంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని దాఖలైన కేసులో తనను ప్రతివాదిగా చేర్చుకోవాలని కోరుతూ నాటి రాష్ట్ర మంత్రి పీ రాములు హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. బోగస్ కంపెనీకి క్రీడాభివృద్ధి పేరుతో హైదరాబాద్ నగరంలోని అత్యంత ఖరీదైన 850 ఎకరాల భూములు కేటాయించి, పలు స్టేడియాల నిర్వహణకు నిధులు విడుదల చేయడంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని న్యాయవాది టీ శ్రీరంగారావు, జర్నలిస్ట్ ఏబీకే ప్రసాద్, వీ విజయసాయిరెడ్డి 2012లో వేర్వేరుగా పిల్స్ దాఖలు చేశారు.
వీటిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాదే, జస్టిస్ జే అనిల్ కుమార్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారించింది. పిటిషనర్ల తరఫున సీనియర్ లాయర్ బీఎస్ ప్రసాద్ వాదించారు. భూకేటాయింపుల రద్దును సవాలు చేస్తూ ఐఎంజీ భారత్ అకాడమీస్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఇదే హైకోర్టు కొట్టివేసిందని గుర్తు చేశారు. సుప్రీంకోర్టుకు వెళ్లినా ఫలితం లేదని చెప్పారు. ఈ పిటిషన్‌పై విచారణ కొనసాగకుండా వాయిదాలు తీసుకోవడం చెల్లదని వాదించారు. రాములు తరఫు సీనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఇదే వ్యవహారంపై గతంలో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారని, దానిని ఏసీబీ కోర్టు కొట్టి వేసిందని గుర్తుచేశారు. దీంతో రివిజన్ పిటిషన్ దాఖలుకు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి ఏసీబీ కోర్టును కోరితే అనుమతించలేదని చెప్పారు. గడువు ఇస్తే ఈ పిటిషన్‌లో కౌంటరు దాఖలు చేస్తామని తెలిపారు. దీనిపై స్పందించిన హైకోర్టు, ఇది పిల్ అని, దీనిలో కౌంటర్ దాఖలు అవసరం లేదని చెప్పింది. విచారణను జూలై 2వ తేదీకి వాయిదా వేసింది.






