ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు
- జెడ్పీ మీటింగ్ మంత్రి తుమ్మల
ఖమ్మం, జూన్ 14 (విజయక్రాంతి): ప్రైవేటు, కార్పోరేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వపాఠశాలల్లో మెరుగైన విద్య అందించేందుకు ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయనున్నట్లు మంత్రి తుమ్మలనాగేశ్వర్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం మంత్రి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జెడ్పీ సాధారణ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. కేవలం వ్యవసాయం, విద్యాశాఖకు చెందిన అంశాల ఎజెండాగా జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. అకాల వర్షాలకు పంటనష్టపోయిన రైతాంగానికి ఎకరానికి రూ.10వేల చొప్పున పంట నష్టం అందించేందుకు ఆదేశాలు జారీ చేశామన్నారు.
గోదావరి జలాలను జిల్లాలో పారించేందుకు నిర్ధిష్టమైన సమయాన్ని ఇచ్చినట్లు తెలిపారు. జూలూరుపాడు, పాలేరు, యాతాల కుంట టెన్నెళ్లు పూర్తిచేసి సత్తుపల్లి, అశ్వారావుపేట,దమ్మపేట మండలాలకు, టెన్నెల్స్ అవసరంలేని ప్రాంతాలైన వైరా, లంకాసాగర్ లకు నాగార్జునసాగర్ ప్రాజెక్టుద్వారా నీళ్లందించేందుకు శక్తివంచన లేకుండా పని చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో జెడ్పీ ఛైర్మన్ లింగాలకమల్‌రాజు మాట్లాడుతూ, రైతులడిమాండ్ మేరకే విత్తనాలు అందించాలన్నారు. సమావేశంలో స్తానికి సంస్థల అదనపు కలెక్టర్ బి.సత్యప్రసాద్, డిసిసిబిఛైర్మన్ దొండపాటి వెంకటేశ్వర్‌రావు, జెడ్పీ సీఈఓ ఎస్. వినోద్, జడ్పటీసీ సభ్యులు, ఎం.పి.పిలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.






