01-11-2025 08:13:40 AM
ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్ సీతారామరావు
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): మొంథా తుఫాను కారణంగా గత రెండు రోజులుగా కురిసిన అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని,ధాన్యం కొనుగోళ్లను,ఎగుమతుల తీరుతెన్నులను జిల్లా అదనపు కలెక్టర్ సీతారామారావు(Additional Collector Seetharama Rao) పరిశీలించారు. శుక్రవారం మండల పరిధిలోని తిమ్మాపురం,అడివెంల,రామన్నగూడెం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయా కేంద్రాల వద్ద రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.
అనంతరం మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో సిబ్బంది రైతులను ఇబ్బంది పెట్టొద్దని,కేంద్రానికి వచ్చిన ధాన్యం నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలని నిర్వాహకులు సూచించారు.వర్షాలకు ధాన్యం తడిసి రంగు మారిపోయిన నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలకు అనుసంధానం చేసిన రైస్ మిల్లులతో సమన్వయం చేసుకుని ధాన్యాన్ని దింపుకునేలా చూసుకోవాలని చెప్పారు.కాంటాలలో ఎటువంటి తేడాలు వేసిన,రికార్డులు సక్రమంగా లేకపోయినా,అక్రమాలకు పాటుపడిన చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.ఆయా కార్యక్రమాల్లో డీఆర్డీఏ పీడీ అప్పారావు,తహశీల్దార్ బాషపాక శ్రీకాంత్,ఎంపీడీఓ గోపి,ఆర్ఐ వెంకటరెడ్డి,ఏఓ గణేష్,ఏఈఓ సత్యం,కేంద్రాల నిర్వహకులు దేవరకొండ విజయ,గణేష్,రైతులు,హమాలీలు తదితరులు పాల్గొన్నారు.