ఇరిగేషన్ సలహాదారుగా ఆదిత్యనాథ్
కీలక పదవి అప్పగించిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం
పదేండ్లుగా ఏపీ ఇరిగేషన్ చూసిన ఆదిత్యనాథ్
తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కొట్లాడిన అధికారి
కేసీఆర్ ప్రాజెక్టుల్లో అక్రమాలు బయటకు లాగేందుకేనా?
హైదరాబాద్, జూన్ 7 (విజయక్రాంతి): తెలంగాణ నీటి పారుదల శాఖ సలహాదారుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆదిత్యనాథ్ దాస్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆయన గత పదేండ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో నీటిపారుదల శాఖలో పనిచేశారు.
ఏపీ ప్రభు త్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన తర్వాత వైఎస్ జగన్ ప్రభుత్వం ఆ రాష్ట్రానికి ముఖ్య సలహాదారుగా కూడా నియమించింది. తెలంగాణ నీటిపారుదల ప్రాజెక్టులపై ఏపీ తరఫున ఆయన కృష్ణా నీటి యాజమాన్య బోర్డులో అనేక ఫిర్యాదులు చేశారు. దీంతో ఈ నియామకం ఇప్పుడు తీవ్ర వివాదాస్పదమ వుతున్నది.
పదేండ్లు తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తిని తీసుకొచ్చి కీలక పదవి ఎలా కట్టబెడుతారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. మరోవైపు మాజీ సీఎం కేసీఆర్ చేపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో అవినీతి, డొల్లతనాన్ని బయట పెట్టేందుకే ఈ నియామకం జరిగిందని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నా యి. ఈ నేపథ్యంలో ఆదిత్యనాథ్‌దాస్ నియామకానికి అనుకూలంగా, వ్యతిరేకంగా వినపడుతున్న అంశాలు ఇలా ఉన్నాయి..
అనుకూలాంశాలు
* ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు సిద్ధంచేసి, కొన్ని పనులు పూర్తిచేసిన ప్రాణహిత ప్రాజెక్టు, అందులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించాల్సిన బరాజ్‌పై ఆదిత్యనాథ్‌దాస్‌కు సంపూర్ణ అవగాహన ఉంది. ఆ సమయంలో నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆయనే ఉన్నారు. ఇప్పుడు తెలంగాణలోని అధికార కాంగ్రెస్ పార్టీ మరోసారి తుమ్మిడిహెట్టిని తెరపైకి తీసుకొస్తోంది. ఆ ప్రాజెక్టును చేపడతామని చెబుతోంది. ఈ నేపథ్యంలో ఆదిత్యనాథ్‌దాస్‌ను సలహాదారుగా నియమించడం ద్వారా ఈ ప్రాజెక్టును వేగవంతం చేసే అవకాశం ఉంది.
* ఆదిత్యనాథ్‌దాస్ నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నప్పుడే కంతానపల్లి ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌ను సిద్ధం చేశారు. ప్రాజెక్టును చేపట్టేముందే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. 2014లో ఏర్పడిన కేసీఆర్ సర్కారు కంతానపల్లిని పక్కనపెట్టి.. తుపాకులగూడెంను తెరపైకి తీసుకొచ్చి పూర్తి చేసింది. ఇందులో జరిగిన లోటుపాట్లను వెలికితీయవచ్చని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తోంది.
* కేఆర్‌ఎంబీలో తెలంగాణ తరఫున వినిపించిన వాదనలు, సమర్పించిన పత్రాల్లోని లోటుపాట్లను ఏపీ తరఫున ఎత్తిచూపడంలో ఆ రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఆదిత్యనాథ్‌దాస్‌కు అనుభవం, అవగాహన ఉంది. ఇప్పుడు ఆయనను తెలంగాణ సలహాదారుగా తీసుకురావడం వల్ల ఆ లోటుపాట్లన్నీ తెలుసుకోవచ్చు.
* కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, సీతారామ లాంటి ప్రాజెక్టుల్లో ఏపీ ప్రభుత్వం వైపు నుంచి ఎత్తిచూపిన లోపాలను తెలుసుకొని వాటిని సరిచేసుకొనే అవకాశంతోపాటు రాజకీయంగా అప్పటి ప్రభు త్వం చేసిన తప్పులను గుర్తించవచ్చు.
వ్యతిరేకాంశాలు
* రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఏపీ తరఫున గొంతుకై వినిపించిన ఆదిత్యనాథ్ దాస్‌ను తెలంగాణ నీటిపారుదల శాఖ సలహాదారుగా నియమించడం వల్ల తెలగాణ ప్రయోజనాలే దెబ్బతింటాయి.
* కేఆర్‌ఎంబీలో మన ప్రయోజనాలను, ప్రభుత్వ వాదనలను తొక్కిపెట్టేలా వ్యవహరించంలో కీలకమైన వ్యక్తిని ఇప్పుడు మన ప్రభుత్వం సలహాదారుగా నియమిస్తే లాభం ఏమీ ఉండదు సరికదా.. నష్టమే ఉంటుంది.
* ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడబోతోంది. అక్కడ సీఎంగా చంద్రబాబు ఉంటారు. ఆయన శిష్యుడినని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చెప్పుకుంటారు. ఈ నేపథ్యంలో గడిచిన పదేండ్లుగా ఏపీ ప్రయోజనాల కోసం పోరాడిన అధికారి.. ఇప్పుడు తెలంగాణ ప్రయోజనం కోసం సలహాలిస్తారంటే ఎలా నమ్ముతారు? చంద్రబాబు ఆలోచనల ప్రకారమే ఆ సలహాలు ఉంటాయి. శిష్యుడు అవే అమలు చేస్తారు.
* ఇప్పటికే పోతిరెడ్డిపాడు, దుమ్ముగూడెం, రాయలసీమ ఎత్తిపోతల వంటి ప్రాజెక్టులను చేపట్టి తెలంగాణ నీటిని తరలిం చుకుపోతున్నారు. వీటిని చేపట్టడంతో ఆదిత్యనాథ్‌దాస్‌ది కీలక పాత్ర. అలాంటి వ్యక్తిని తెలంగాణ నీటిపారుదల శాఖ సలహాదారుగా ఎలా నియమిస్తారు?
* తెలంగాణలోనే జల వివాదాలు, ప్రాజెక్టులు, జల వనరులపై పూర్తిస్థాయి అవగాహన ఉన్న రిటైర్డ్ అధికారులు ఎందరో ఉన్నారు. తెలంగాణ ప్రయోజనాలకోసమే కట్టుబడే వారందరినీ పక్కనపెట్టి.. ఇప్పటివరకు ఆంధ్రా ప్రాజెక్టులు, అక్కడి ప్రజల ప్రయోజనాల కోసం పనిచేసిన అధికారికి ఇలాంటి పదవి ఇస్తారా?
* కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉంటున్నందున ఆ పార్టీ అధినేత, ఏపీ కాబోయే సీఎం చంద్రబాబు కోరుకొన్నట్టే రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ప్రాజెక్టులు, జల వనరుల వివాదాలకు పరిష్కారం లభిస్తుంది. ఈ దశలో ఆ రాష్ట్రంలో పనిచేసిన అధికారిని ఇక్కడ సలహాదారుగా నియమించడం వల్ల అంతిమంగా ఏపీ ప్రయోజనాలను కాపాడేలా వ్యవహరించే అవకాశం ఉంది. అదీగాక కేంద్రంలో జల వనరుల శాఖను తమకు ఇవ్వాలని టీడీపీ డిమాండ్ చేస్తున్నది.
* అదే జరిగితే తెలంగాణ మొత్తం ఎడారిలా మారుతుందని బీఆర్‌ఎస్ నేతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.






