21-01-2026 03:08:40 PM
అనుమతి లేని కళాశాలపై చర్యలు తీసుకోవాలి
-స్వేరో విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు సాయికుమార్
హనుమకొండ,(విజయక్రాంతి): విద్యా సంవత్సరం పూర్తికాకుండానే, రాబోయే విద్యా సంవత్సరం కోసం కొత్త,కొత్త పేర్లతో కార్పోరేట్ కళాశాలలు ముందస్తు ఇంటర్మీడియట్ అడ్మిషన్ల దందా జోరుగా సాగుతుందని, ఈ దందాను అరికట్టాలని స్వేరోస్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో హనుమకొండ డిఐఈఓ, గోపాల్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం స్వేరోస్ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ఎల్తూరి సాయికుమార్ మాట్లాడుతూ... హనుమకొండ నగరంలో విచ్చలవిడిగా ప్రైవేట్ జూనియర్ కళాశాలలు అడ్వర్టైజ్మెంట్ హోల్డింగ్స్ పెట్టి విద్యార్థులను మోసం చేసే ప్రక్రియ జరుగుతుంది.
సంవత్సరానికి ఒక కొత్త, కొత్త పేర్లతో జూనియర్ కళాశాలలు రావడంతో విద్యార్థులు పేర్లు చూసి మోసపోతూ, అనుమతి లేని కళాశాలల్లో అడ్మిషన్లు పొందిన తర్వాత చదవలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. సరైన అనుమతి లేని కళాశాలలను తనిఖీ చేసి, అనుమతి లేని పేర్లు కలిగిన హోల్డింగ్ ను వెంటనే తొలగించి విద్యార్థులను, వారి తల్లిదండ్రులను మోసపోకుండా కాపాడాలని డిమాండ్ చేశారు. అనుమతి లేని పేర్లతో కళాశాలల పేర్లు చెపుతూ, విద్యార్థులను మోసం చేయాలని చూస్తున్న యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
లేనియెడల స్వేరో స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా అనుమతి కలిగిన పేర్లతో జూనియర్ కళాశాల లను ఆన్లైన్లో విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా అందుబాటులో ఉంచాలని కోరారు.ఈ కార్యక్రమంలో స్వేరో స్టూడెంట్స్ యూనియన్ కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యక్షులు చెట్టుపల్లి శివకుమార్, సుశాంత్, కార్తీక్, సాయి, తేజ, చందు తదితరులు పాల్గొన్నారు.