22 August, 2026 | 2:07 AM

హైదరాబాద్ నగరానికి ముంచుకోస్తున్నాఆఫత్

14-06-2024 12:33 AM
  • మూసుకుపోతున్న వరదనీటి దారులు
  • పట్టించుకోని హెచ్‌ఎండీఏ అధికారులు 
  • ప్రశ్నార్థకంగా జంట జలాశయాల ఉనికి

హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 13 (విజయక్రాంతి): వందేండ్లు గా హైదరాబాద్ మహా నగర ప్రజల దప్పిక తీర్చుతున్న జంట జలాశయాలకు ముప్పు ముంచుకొస్తున్నది. అనంతగిరి అడవుల మీదుగా పొంచి ఉన్న జలగండం నుంచి హైదరాబాద్ నగరాన్ని కాపాడుతున్న జలవనరులకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది.  అధికారుల తీరు, పాలకుల అనాలోచిత నిర్ణయాలతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది. అయితే చాలా మంది జంట జలాశయాలకు ఆఫత్ వచ్చింది అనుకుంటున్నారు. కానీ జంట నగరాలకు కూడా వందేండ్ల కిందటి ఆఫత్ వస్తుందనే సోయి హైదరాబాద్ మహానగర నివాసులకు లేకపోవడం విచారకరం. ఈ క్రమంలోనే చారిత్రాత్మక ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లపై 111జీవో రద్దు, జీవో ఉత్తర్వుల ముసుగులో జరుగుతున్న విధ్వంసం, దాని వలన భవిష్యత్తులో హైదరాబాద్ ప్రజలకు కలిగే అనర్థాలు, ప్రభుత్వాల అవకాశవాద రాజకీయాలపై “విజయక్రాంతి” ప్రత్యేక కథనం... 

1908లో వచ్చిన వరదలతో...

హైదరాబాద్ నగరాన్ని సుమారు 116 ఏండ్ల కిందట (1908లో ) వరదలు ముంచెత్తడంతో పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. భవిష్యత్తులో అలాంటి పరిస్థితి రావద్దనే సంకల్పంతో నాటి నిజాం ప్రభుత్వం అప్పటి ప్రభుత్వ చీఫ్ ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశరయ్యతో చర్చించి, 1920లో ఉస్మాన్ సాగర్‌ను నిర్మించారు. అనంతరం 1927లో హిమాయత్ సాగర్ (గండిపేట్ లేక్)ను నిర్మించడం జరిగింది. ఈ రెండు జల వనరులు కూడా జంట జలాశయాలుగా ప్రసిద్ధి.

హైదరాబాద్ పైభాగంలో నున్న వికారాబాద్ అనంతగిరి అడవుల నుంచి వచ్చే వరదల ఉధృతి హైదరాబాద్ పట్టణ జనావాసాల్లోకి రాకుండా నగర పైభాగంలోనే కట్టడి చేయడంతో పాటు, గత 100 ఏండ్లుగా జంట నగరాల (హైదరాబాద్, సికింద్రాబాద్) ప్రజల దప్పిక తీర్చుతూ జంట జలాశయాలుగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ విశేష విశిష్టతను పొందాయి. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లు కేవలం వర్షపు నీటితో మాత్రమే నిండుతాయి. అలాగే ఎలాంటి నీటి ఎత్తిపోతలు, పంపింగ్, ఇతర  లిఫ్ట్ పద్ధతులతో సంబంధం లేకుండానే గ్రావిటీ ద్వారనే ప్రతియేడాది 65 మిలియన్ గ్యాలన్ల స్వచ్ఛమైన తాగునీరు జంటనగరాల ప్రజలకు సరఫరా అవుతుంది. 

1989 నుంచి సంరక్షణ చర్యలు

హైదరాబాద్ ప్రజల దాహర్తిని తీర్చడంతో పాటు వరద ఉదృతిని కట్టడి చేస్తున్న ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల సంరక్షణకు గత ప్రభుత్వాలు ఏదో ఒక స్థాయిలో చర్యలు తీసుకున్నాయి. ఇందులో భాగంగా మొదటగా 1989 జనవరి 28వ తేదీన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ల నీటి నిల్వ సామర్థ్యాన్ని (హైడ్రోలాజికల్ ఏరియా) సంరక్షించాలనే లక్ష్యంతో అప్పటి ప్రభుత్వం జీవో- విడుదల చేసింది. అలాగే ఈ జలాశయాలను కాలుష్యం బారి నుంచి రక్షించాలని 1994 మార్చి 31వ తేదీన జీవో- రూపకల్పన చేసింది. ఆ క్రమంలోనే 90వ దశకంలో తీవ్రస్థాయిలో అనావృష్టి ఏర్పడింది. ఆ సమయంలో హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీరుస్తున్న నిజాం సాగర్, హిమాయత్ సాగర్ ప్రాధాన్యాన్ని గుర్తించిన చంద్రబాబునాయుడు ప్రభుత్వం 1996 మార్చి 8న 111 జీవోను విడుదల చేసింది.

ఆ తర్వాత ఈపీటీఆర్‌ఐ (ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్) సలహా మేరకు 2005 నవంబర్ 29వ తేదీన టెక్నికల్ కమిటీని నియమిస్తూ జీవో- విడుదల చేశారు. అలాగే జంట జలాశయాల దిగువ ప్రాంతాల్లోను పలు నిబంధనలు అమలు చేస్తూ 2007 జూలై 16వ తేదీన మెమో నంబర్  261-1-2006 జారీ చేశారు. జంట జలాశయాల సమీపం ప్రాంతాల్లో పర్యావరణ నిబంధనలను అతిక్రమించిన ప్రగతి రిసార్ట్స్‌పై  చర్యల కోసం 2007 అక్టోబర్ 12న ప్రభుత్వం మెమో నెంబర్ - 14046-2007ను జారీ చేశారు. ఈ చట్టాలు, మెమోలన్నింటి సారాంశం, ప్రధాన లక్ష్యం.. జంటనగరాల ప్రజల దాహార్తిని తీరుస్తున్న ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లను ఆక్రమణలకు గురికాకుండా కాపాడుతూ, కాలుష్యపు బారిన పడకుండా సంరక్షించుకోవాలి.  అయితే... స్వరాష్ట్రంలోనే ఈ జంట జలాశయాలకు చేటు చేసే పరిస్థితులు ఏర్పడటం గమనార్హం.