calender_icon.png 13 November, 2025 | 1:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్ ఎదురీత

17-12-2024 12:20:27 AM

బ్రిస్బేన్: బోర్డర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ ఎదురీదుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 4 వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (33 నాటౌట్), రోహిత్ శర్మ క్రీజులో ఉన్నారు. రెండో టెస్టులో రాణించిన మిచెల్ స్టార్క్ మరోసారి అదరగొట్టి 2 వికెట్లు పడగొట్టాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (4) పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఆ వెంటనే గిల్‌ను (1) కూడా స్టార్క్ బోల్తా కొట్టించాడు.

ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీని హాజిల్‌వుడ్ ఔట్ చేయడంతో 22 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో పంత్ (9) కాసేపు అడ్డుకున్నప్పటికీ కమిన్స్ బౌలింగ్‌లో వెనుదిరగడంతో భారత్ 44 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. మరో ఎండ్‌లో కేఎల్ రాహుల్ మాత్రం ఓపిక ప్రదర్శిస్తూ వీలు చిక్కినప్పుడల్లా పరుగులు సాధించాడు. రోహిత్ క్రీజులోకి వచ్చిన కాసేపటికే వర్షం ప్రారంభమవ్వడంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు.

పిచ్ సీమర్లకు విపరీతంగా అనుకూలిస్తున్న వేళ వరుణుడు అడ్డుపడకపోయుంటే భారత్ మరిన్ని వికెట్లు కోల్పోయేదే. రెండో రోజు తెరిపినిచ్చిన వరుణుడు మూడో రోజు మాత్రం ఆటకు అడ్డు తగిలాడు. వర్షం అంతరాయంతో మూడో రోజు కేవలం 34 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. 

ఆరేసిన బుమ్రా..

అంతకముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌటైంది. 405/7 క్రితం రోజు స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ మరో 40 పరుగులు జత చేసింది. స్టార్క్ (18)ను బుమ్రా పెవిలియన్ చేర్చాడు.ఈ దశలో ఓవర్ నైట్ బ్యాటర్ అలెక్స్ కేరీ (88 బంతుల్లో 70) కాస్త ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. ఇన్నింగ్స్ చివరి వికెట్‌గా కేరీ వెనుదిరగడంతో ఆసీస్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. భారత బౌలర్లో బుమ్రా 6 వికెట్లు తీయగా.. సిరాజ్ 2 వికెట్లు తీశాడు.