17-12-2024 12:23:56 AM
* ప్రపంచ చాంపియన్‌కు ఘన స్వాగతం
* భారీ గజమాలతో సత్కారం
చెన్నై: ప్రపంచ చెస్ చాంపియన్ గుకేశ్ దొమ్మరాజు భారత గడ్డపై అడుగుపెట్టాడు. సోమవారం స్వస్థలానికి చేరుకున్న గుకేశ్‌కు చెన్నై ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం లభించింది. చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఫిడే ప్రపంచ చెస్ చాంపియన్‌గా అవతరించిన గుకేశ్‌ను చూడడానికి అభిమానులు పోటెత్తారు. అశేష జనవాహిని మధ్య చెస్ లో ఓనమాలు నేర్చుకున్న వెలమ్మాల్ స్కూల్ బృందం గుకేశ్‌ను గజమాలతో సత్కరించింది.
అనంతరం పూలతో ప్రత్యేకంగా డెకరేట్ చేసిన కారులో గుకేశ్ తన తల్లిదండ్రులతో కలిసి ఇంటికి బయల్దేరి వెళ్లాడు. ఈ నేపథ్యంలో దారి పొడవునా గుకేశ్‌ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. కాగా నేడు చెన్నైలోని వల్లజా రోడ్‌లోని కలైవానర్ ఆరంగమ్ భవన్‌లో గుకేశ్‌కు ప్రభుత్వం గ్రాండ్ రిసెప్షన్ వేడుక ఏర్పాటు చేసింది. గుకేశ్‌ను సన్మానించనున్న ఐకానిక్ ఆడిటోరియం వరకు స్పెషల్ పరేడ్ నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి డీఎంకే అధినేత స్టాలిన్ హాజరవ్వనున్నారు. కాగా గుకేశ్‌కు సీఎం స్టాలిన్ రూ. 5 కోట్ల చెక్ అందించనున్నారు. ఇక సింగపూర్ వేదికగా జరిగిన వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్ టోర్నీలో చైనా గ్రాండ్‌మాస్టర్ డింగ్ లిరెన్‌ను ఓడించి గుకేశ్ తొలిసారి చెస్ చాంపియన్‌గా నిలిచాడు. 18 ఏళ్లకే ఈ ఫీట్ సాధించిన అత్యంత పిన్నవయస్కుడినూ గుకేశ్ రికార్డులకెక్కాడు. బుడాపెస్ట్ వేదికగా చెస్ ఒలింపియాడ్‌లో స్వర్ణం గెలిచిన భారత జట్టులోనూ గుకేశ్ సభ్యుడిగా ఉన్నాడు.