13 April, 2026 | 11:05 PM

పాక్‌పై ఉగ్ర పంజా

27-08-2024 01:48 AM
  1. బలూచ్‌లోని హైవేను అడ్డగించి విధ్వంసం
  2. బస్సులు, ట్రక్కులను ఆపేసి ప్రయాణికులపై కాల్పులు
  3. పోలీస్ స్టేషన్లపైనా దాడులు
  4. ఈ ఘటనల్లో 51మంది మృతి

ఇస్లామాబాద్ (పాకిస్థాన్), ఆగస్టు 26: పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు విధ్వంసం సృష్టించారు. బలూచిస్థాన్‌లోని ముసాఖేల్ జిల్లాలోని రరాషమ్ వద్ద హైవేను అడ్డగించిన సాయుధులు వాహనాల నుంచి ప్రయాణికుల్ని దింపేసి కాల్పులకు తెగబడ్డారు. బలూచిస్థాన్‌లోని పలు పోలీస్ స్టేషన్లు, రైల్వే ట్రాకులపైనా దాడులు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనల్లో 51 మంది మరణించినట్లు తెలిపారు. ఇందులో 23 మందిని హైవే ఆపిన బస్సు నుంచి దించి వారి వివరాలను తెలుసుకుని మరీ చంపినట్లు పేర్కొన్నారు. బలూచిస్థాన్‌లో జరిగిన అతిపెద్ద దాడిగా అధికారులు దీన్ని అభివర్ణించారు.   

పంజాబ్‌కు చెందినవారిపైనే..

పంజాబ్ ప్రావిన్సుకు చెందినవారే లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. చనిపోయిన బాధితులందరూ పంజాబ్ రాష్ట్రానికి చెందినవారుగా అధికారులు తెలిపారు. హైవేపై బొగ్గును తరలిస్తున్న 10 లారీలను తగలబెట్టారు. ట్రక్ డ్రైవర్లను సైతం చంపేశారు. 

చేసింది మేమే 

నిషేధిత ఉగ్ర సంస్థ బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ) ఈ దాడులు చేసినట్లు ప్రకటించింది. పారామిలిటరీ స్థావరంపైనా దాడి చేసినట్లు బీఎల్‌ఏ తెలిపినా అధికారులు ఇంకా ధ్రువీకరించలేదు. ఈ ఘటనపై స్పందించిన బలూచిస్థాన్ సీఎం సర్ఫరాజ్ బుగ్తీ దాడిని తీవ్రంగా ఖండించారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బలూచ్‌లో గతంలోనూ ఇలాంటి దాడులు జరిగడం గమనార్హం.