14 April, 2026 | 12:39 AM

కశ్మీర్‌లో కాంగ్రెస్, ఎన్సీ సీట్లు ఖరారు

27-08-2024 01:47 AM

పార్టీ ముఖ్య నేతల మధ్య చర్చలు సఫలం

న్యూఢిల్లీ, ఆగస్టు 26: జమ్ముకశ్మీర్‌లో మరో నెలలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ), కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు కుదిరింది. తొలి విడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మరికొన్ని గంటల్లో ముగియనుండగా సోమవారం సాయంత్రం జరిగిన రెండు పార్టీల సీనియర్ నేతల భేటీలో చర్చలు ఫలించాయి. మొత్తం 90 అసెంబ్లీ సీట్లకు గాను ఎన్సీ 51, కాంగ్రెస్ 32 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించారు. మరో రెండు స్థానాలను సీపీఎం, పాంథర్స్ పార్టీలకు కేటాయించినట్లు జమ్ముకశ్మీర్ యూనిట్ కాంగ్రెస్ చీఫ్ తారీఖ్ హమీద్ కర్రా తెలిపారు.

మిగిలిన 5 స్థానాల్లో స్నేహపూర్వక పోటీ ఉంటుందని స్పష్టం చేశారు. సీట్ల పంపకాలపై రెండు పార్టీల మధ్య విభేదాలు తలెత్తినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఇద్దరు సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, సల్మాన్ ఖుర్షీద్‌ను శ్రీనగర్‌కు పంపింది కాంగ్రెస్. అనంతరం జరిగిన చర్చల్లో సీట్ల పంపకాలపై క్లారిటీ వచ్చిందని హమీద్ తెలిపారు. కాగా, జమ్ముకశ్మీర్‌లో 3 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.