బుల్లెట్లు తగిలినా పాట పాడుతూ
కాలిఫోర్నియా (అమెరికా), ఆగస్టు 26: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో తల్లిదండ్రులను చంపిన ఓ నరహంతకుడిపై పోలీసులు కాల్పులు జరిపారు. ఆ సమయంలో ఆ వ్యక్తి ‘ఐ లవ్ యూ’ అంటూ పాట పాడాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే జోసెఫ్ గెర్డ్‌విల్ (41) తన తల్లిదండ్రులు అంటోనియేట్ (79), రొనాల్డ్ (77)ను జూలై 9న దారుణంగా హత్యచేశాడు. అందుకు సంబంధించిన ఫొటోలను తన సోదరుడికి పంపగా అతను అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఓ గోల్ఫ్ కోర్టు పార్కింగ్ ప్రదేశంలో నిందితుడి పోలీసులు గుర్తించి అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా అతను ఎదురుదాడికి దిగాడు. దీంతో పోలీసులు ఐదు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ సమయంలో అతను పాట పాడటం గమనార్హం. అనంతరం జోసెఫ్‌ను స్థానిక ఆసుపత్రిలో పోలీసులు చేర్పించారు. అతని ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు అధికారులు తెలిపారు.




