03-05-2025 06:48:40 PM
ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఏషామోని మల్లేష్..
దేవరకొండ: యువతకు విద్య, వైద్య, ఉపాధి హక్కులను కల్పించడంలో పాలకులు విఫలమయ్యారని, మత ఛాందస విధానాలకు వ్యతిరేకంగా యువత పోరాడాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) జిల్లా సహాయ కార్యదర్శి ఏషామోని మల్లేష్ అన్నారు. ఏఐవైఎఫ్ 66వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దేవరకొండ డివిజన్ సమితి ఆధ్వర్యంలో శనివారం దేవరకొండ పల్లా పర్వత్ రెడ్డి భవన్ లో యువజన సంఘ జెండాను మల్లేష్ ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... దేశ భవిష్యత్ను తీర్చిదిద్దడంలో యువత పాత్ర ప్రధానమైనదన్నారు.
దేశ స్వాతంత్య్రానంతరం నల్లదొరల దోపిడీని అడ్డుకునేందుకు 1959 మే 3వ తేదీన ఎఐవైఎఫ్ ఆవిర్భవించిందన్నారు. పనిహక్కును ప్రాథమిక హక్కుగా గుర్తించాలని, సమగ్ర యువజన విధానం కోసం, విద్య, వైద్య వ్యాపారాన్ని రద్దుచేయాలని, అవినీతికి వ్యతిరేకంగా, ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం, ప్రకృతి సంపద ప్రజలకే దక్కాలని, భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ యాక్టును రూపొందించి, అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలను యువతకు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ డివిజన్ నాయకులు జూలూరి మహేష్, వలమల్ల ఆంజనేయులు, పొలాగోని గణేష్, దాసరి జంగయ్య, గోరటి శ్రీను తదితరులు పాల్గొన్నారు.