calender_icon.png 4 May, 2025 | 11:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దిగుమతులపై నిషేధం

04-05-2025 01:25:27 AM

పాక్‌పై కఠిన చర్యలు

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ నిర్ణయం

  1. భారతీయ పోర్టుల్లోకి పాక్ నౌకలకు నో ఎంట్రీ
  2. పాక్ నుంచి వచ్చే మెయిల్స్, పార్శిల్స్ కూడా బంద్

న్యూఢిల్లీ, మే 3: ఇప్పటికే పాకిస్థాన్‌కు అనేక షాక్‌లు ఇస్తున్న భారత్ శనివారం ఆ దేశంపై మరిన్ని ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షల విధింపుతో పాక్ ఉక్కిరిబిక్కిరి కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే పాక్ విమానాలకు గగనతలాన్ని మూసేసిన భారత ప్రభుత్వం తాజాగా పాక్ నుంచి అన్ని రకాల దిగుమతులపై కూడా నిషేధం విధించింది.

పాకిస్థాన్ జెండాతో ఉన్న ఓడలు భారతదేశంలోని పోర్టుల్లోకి రావొద్దని డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ (డీజీసీఏ) ఆదేశాలు జారీ చేసింది. పాకిస్థాన్ దేశం నుంచి భారత్‌లోకి వాయు, సముద్ర, రోడ్డు మార్గాల ద్వారా వచ్చే పార్శిళ్ల మీద కూడా ప్రభుత్వం కొరడా ఝలిపించింది. ఈ నిర్ణయాలతో పాక్ ఆర్థిక వ్యవస్థ మరింత కుదేలవనుందని పలువురు ఆర్థిక వేత్తలు ఆభిప్రాయపడుతున్నారు. 

దిగుమతులు బంద్

పాకిస్థాన్ నుంచి వచ్చే అన్ని రకాల దిగుమతులపై భారత్ నిషేధం విధించింది. ఇందుకు సంబంధించి తాజాగా కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కొన్ని వస్తువులు నేరుగా పాకిస్థాన్ ఎగుమతి చేస్తుండగా.. కొన్ని మాత్రం థర్డ్ పార్టీల ద్వారా దేశంలోకి వస్తున్నాయి. విదేశీ వాణిజ్య విధానం (ఎఫ్‌టీపీ)లో వాణిజ్యమంత్రిత్వ శాఖ కొత్తగా నిబంధనను చేర్చింది.

‘పాకిస్థాన్ నుంచి భారత్‌కు వచ్చే ప్రత్యక్ష, పరోక్ష దిగుమతులపై నిషేధం విధిస్తున్నాం. దేశ భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం.’ అని కేంద్ర వాణిజ్యశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే అటారీ-వాఘా సరిహద్దు గుండా వాణిజ్యాన్ని రద్దు చేశారు. పుల్వామా దాడి తర్వాత భారత్-పాక్ మధ్య అంతగా ఎగుమతి, దిగుమతులు లేవు.

2023-24లో అటారీ-వాఘా సరిహద్దు గుండా రూ. 3,886.53 కోట్ల వాణిజ్యం జరిగింది. పాకిస్థాన్ నుంచి భారత్ ప్రధానంగా 3 మిలియన్ డాలర్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంది. కానీ పాకిస్థాన్ మాత్రం భారత్ ఎగుమతి చేసే ఫార్మా ఉత్పత్తులపై ఎక్కువగా ఆధారపడింది.

భారత్ వాణిజ్యాన్ని నిలిపివేయడంతో పాక్ ఇబ్బందులు పడుతోంది. 2024-25లో భారత్ పాకిస్థాన్‌కు 447.65 మిలియన్ డాలర్ల ఉత్పత్తులను ఎగుమతి చేయగా.. కేవలం 0.42 మిలియన్ డాలర్ల విలువ ఉన్న ఉత్పత్తులనే ఆ దేశం నుంచి దిగుమతి చేసుకుంది. 

పాకిస్థాన్ నౌకలు రావొద్దు 

పాకిస్థాన్ జెండాతో ఉన్న ఏ ఒక్క నౌక కూడా భారతదేశంలోని పోర్టుల్లోకి ప్రవేవించకుండా డీజీసీఏ ఆదేశాలిచ్చింది. ‘తక్షణమే ఆదేశాలు అమల్లోకి వస్తాయి. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. భారతీయ ఆస్తుల భద్రత, ప్రజాప్రయోజనం, భారతీయ షిప్పింగ్ ప్రయో జనాల దృష్ఠ్యా ఈ నిర్ణయం తీసుకున్నాం.

మర్చంట్ షిప్పింగ్ చట్టం 1958లోని సెక్షన్ 411 ద్వారా ఇవ్వబడిన అధికారాన్ని ఉపయోగించి ఈ నిర్ణయం తీసుకున్నాం. పాకిస్థాన్ జెండా కలిగి ఉన్న ఏ ఓడ కూడా భారతీయ ఓడరేవును సందర్శించేందుకు వీలు లేదు. భారతీయ జెండా ఉన్న ఏ నౌక కూడా పాక్‌లోని ఓడరేవులను సందర్శించదు.’ అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

మర్చం ట్ షిప్పింగ్ చట్టంలోని సెక్షన్ 411 కింద డీజీఎస్ ఓడలకు ఆదేశాలు ఇచ్చే వీలు కలు గుతుంది. డీజీఎస్ ఉత్తర్వులు కేవలం భారత్, పాక్ జెండాలు ఉన్న ఓడలకే వర్తిస్తాయి. వేరే దేశం జెండాలు ఉన్న ఓడలు ఎటువంటి ఆంక్షలు లేకుండా భారత్, పాక్ మధ్య సంచరించేందుకు వీలు ఉంటుంది. అంతర్జాతీయ సముద్రయాన సంస్థ (ఐఎంవో) మార్గదర్శకాల ప్రకారమే ఉత్తర్వులు జారీ చేసినట్టు పేరు తెలిపేందుకు ఇష్టపడని డీజీఎస్ సీనియర్ అధికారి తెలిపారు. 

మెయిల్స్, పార్శిల్స్ ఎక్సేంజీ నిలిపివేత

పాకిస్థాన్ నుంచి వాయు, ఉపరితల మార్గాల ద్వారా వచ్చే అన్ని రకాల మెయిల్, పారిల్స్‌ను నిలిపివేస్తూ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.