6 August, 2026 | 2:25 AM

సీనియర్లను గౌరవించాలి: రహానే

06-08-2026 12:00 AM

టెస్ట్ ఫార్మాట్‌లో సీనియర్లే కీలకం

గంభీర్‌పై రహానే పరోక్ష వ్యాఖ్యలు

సెలక్టర్ల తీరుపైనా అసంతృప్తి

ముంబై, ఆగస్టు 5: భారత క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాత ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా సీనియర్లు ఒక్కొక్కరుగా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారు. వారి పట్ల గంభీర్ వ్యవహారశైలే దీనికి కారణమని చాలా మంది అభిప్రాయం. గంభీర్ వచ్చిన తర్వాత సీనియర్లకు గౌరవం లేదని ఇప్పటికే పలువురు వ్యాఖ్యానించారు. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సీనియర్ బ్యాటర్ అజింక్య రహానే ఇదే అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

సెలక్టర్లు, హెడ్ కోచ్ గంభీర్‌లపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసాడు. వరుసగా సీనియర్లను పక్కన పెట్టడంపై అసహనం వ్యక్తం చేశాడు. భారత క్రికెట్‌లో సీనియర్ ప్లేయర్స్‌ను గౌరవించాలని సూచించాడు. ఏ జట్టులోనైనా సీనియర్ ఆటగాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలన్నాడు. ముఖ్యంగా టెస్ట్ ఫార్మాట్‌లో గెలిపించేది సీనియర్ల అనుభవమేనన్నాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా వంటి కఠినమైన పిచ్‌లపై అనుభవజ్ఞులైన ఆటగాళ్ల అవసరం ఎంతైనా ఉంటుందని రహానే అభిప్రాయపడ్డాడు.

ఈ సందర్భంగా సెలక్టర్ల తీరుపైనా రహానే కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్ తరఫున ఎంతో క్రికెట్ ఆడిన తనలాంటి సీనియర్ ప్లేయర్‌ను జట్టు నుంచి తప్పించేటప్పుడు సెలెక్టర్లు కనీసం సమాచారం ఇవ్వకపోవడం బాధ కలిగించిందన్నాడు. దేశవాళీ క్రికెట్ లో రాణిస్తున్న సీనియర్ ఆటగాళ్లను వయసుతో సంబంధం లేకుండా జట్టు ఎంపికలో పరిగణలోకి తీసుకోవాలని సూచించాడు. రోహిత్ , కోహ్లీ, పుజారా వంటి ప్లేయర్స్ టెస్టుల్లో తమ అనుభవంతో మ్యాచ్ లు గెలిపించిన సందర్భాలను గుర్తు చేశాడు. అలాగని యువ ఆటగాళ్ల పాత్రను తాను తక్కువ చేసి చూపడం లేదనీ, టెస్టుల్లో మాత్రం కనీసం ఏడుగురు సీనియర్లు, నలుగురు యువ ఆటగాళ్ల కూర్పుతో బరిలోకి దిగాలన్నాడు.

గత ఏడాది కాలంగా టీమిండియాకు సీనియర్లు దూరమవడం ఆందోళన కలిగిస్తుందన్నాడు. సీనియర్ ప్లేయర్స్ అందరూ దాదాపు ఒకేసారి రిటైర్మెంట్ ప్రకటించడం ఏ జట్టుకూ మంచిది కాదన్నాడు. ఇక ఇటీవల కాలంలో క్రికెట్ ఆడి రిటైర్ అయిన మాజీలే సెలక్టర్లుగా ఉండాలని రహానే అభిప్రాయపడ్డాడు. ఇదిలా ఉంటే వైట్ బాల్ క్రికెట్లో విరాట్ కోహ్లీ సక్సెస్ సీక్రెట్ గురించి ఎన్నిసార్లు అడిగినా చెప్పలేదని, అతనితో తనకు మంచి స్నేహం ఉందని రహానే తెలిపాడు. విరాట్ దూకుడు, తన ప్రశాంతతో టీమిండియాకు మంచి విజయాలు అందించామని గుర్తు చేసుకున్నాడు.