ఆర్‌బీఐ ఉద్యోగంలో ఇషాన్ కిషన్ బిజీ
పాట్నా,ఆగస్టు 5: టీమిండియా స్టార్ క్రికెటర్ ఇషాన్ కిషన్ బుధవారం కొత్త రోల్‌లో బిజీబిజీగా కనిపించాడు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ మేనేజర్ విధుల్లో నిమగ్నమయ్యాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కొంతకాలంగా అంతర్జాతీయ క్రికెట్‌తో తీరిక లేకుండా గడిపిన ఇషాన్ ఇప్పుడు శ్రీలంక టూర్‌కు ఎంపిక కాలేదు. దీంతో స్వస్థలంలో ఉన్న అతడు ఆర్బీఐ విధుల్లో చేరాడు. స్పోర్ట్స్ కోటాలో భాగంగా చాలా కాలం క్రితమే ఇషాన్ కిషన్‌కు ఆర్‌బీఐలో ఉద్యోగం వచ్చింది.
ఈ ఉద్యోగ విధుల్లో భాగంగానే పాట్నాలోని ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లిన ఇషాన్‌కు సహచర ఉద్యోగులు ఘనంగా స్వాగతం పలికారు. అతడితో ఫొటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్‌గా మారాయి. ఆర్బీఐ అసిస్టెంట్ మేనేజర్‌గా నెలకు ఇషాన్ కిషన్‌కు రూ. 1.24 లక్షల వరకు వేతనం అందుతోంది. ఇదిలా ఉంటే ఆగస్టు 23 నుంచి దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ దులీప్ ట్రోఫీ జరగనుంది. ఈ టోర్నీలో ఈస్ట్‌జోన్ జట్టుకు ఇషాన్ కిషన్ సారథిగా ఎంపికయ్యాడు. ఈ లోపు తన జాబ్‌లో కొన్నిరోజులు గడిపేందుకు నిర్ణయించుకున్నాడు.






