మొహిజుద్దీన్ హత్యలో ఆలంఖాన్ అరెస్ట్
- పరారీలో తావూస్, మునీర్, కిషన్ సింగ్
- భూవివాదాలే కారణం,
- ఈ కేసులో కాంగ్రెస్ నేత పాత్ర
సికింద్రాబాద్, మే27 (విజయ క్రాంతి): వక్స్ బోర్డు ప్యానల్ న్యాయవాది ఖాజా మొహిజుద్దీన్ హత్య కేసు కొలిక్కి వచ్చింది. ఈ హత్యకు భూవివాదాలే కారణమని, బర్కత్‌పుర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేత సూత్రధారి అని తేలింది. ఆయనతో సహా నలుగురిని అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. వీళ్లు కూడా చిక్కితే ఈ హత్యోదంతం ఆద్యంతాలపై స్పష్టత వస్తుందని అధికారులు చెప్తున్నారు.
మొహిజుద్దీన్ కొన్నేళ్లుగా వక్ఫ్ భూముల పరిరక్షణకు పోరాడుతున్నారు. ఓభూమికి సంబంధించి బర్కత్‌పురకు చెందిన కీలక కాంగ్రెస్ నేతతో విభేదాలు వచ్చాయి. తమ ఆధీనంలో ఉన్న ఈ భూమి విషయంలో జోక్యం చేసుకోవద్దంటూ ఆ నేతతోపాటు ఆయన కుమారుడు సైతం మొహిజుద్దీన్, ఆయన కుమారుడు ఫర్హ్పానా పలుమార్లు ఒత్తిడి తీసుకువచ్చారు. తీవ్రస్థాయిలో బెదిరింపులకు దిగడంతోపాటు ఆ భూ వివాదం కేసు నుంచి వైదొలిగితే రూ.రెండు కోట్లు ఇస్తామంటూ మొహిజుద్దీన్‌కు ఆఫర్ చేశారు.
అయితే రాజీ పడబోనని చెప్పడంతో మొయిజుద్దీన్‌ను హత్యను చేయాలని భావించి ఆ పనిని తావూస్, మునీర్లకు అప్పగించారు. కాగా, సుపారీ గ్యాంగ్‌తో పనిపూర్తి చేయించాలని నగరానికి చెందిన కిషన్ సింగ్ అలియాస్ పప్పును వీరు కలిసి విషయం చెప్పారు. సుపారీ కింద రూ.15 లక్షలు చెల్లించారు. హత్య బాధ్యతను కవాడిగూడకు చెందిన సింగూరి అభిజీత్ అలియాస్ నాని, వినయ్, మణిదీప్లకు అప్పగించి రూ.10 లక్షలు చెల్లించాడు.
ఈ ముగ్గు రూ పప్పుతో కలిసి పథకం వేసి, కారు కొని, రెక్కీ చేసి,శనివారం మొయిజుద్దీన్‌ను రెడీల్స్ శాంతినగర్‌లో హత్య చేశారు. కాగా స్టంట్స్‌లో అనుభవం ఉన్న అభిజితే హత్య జరిగిన రోజు కారు నడిపాడు. మణిదీప్, వినయ్ అందులో కూర్చున్నారు. హత్యా సమయంలో కారుకు నెంబర్ ప్లేట్ లేకపోయినా వివిధ ప్రాంతాల్లోని సీసీ ఫుటేజీల ఆధారంగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు అభిజిత్‌ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
ఇతడిచ్చిన సమాచారంతో మణిదీప్, వినయ్‌లను పట్టుకున్నారు. పరారీలో ఉన్న తావూస్,మునీర్, కిషన్ సింగ్ కోసం మూడు రాష్ట్రాల్లో గాలిస్తున్నారు. ఈ హత్య కేసులో సదరు కాంగ్రెస్ నేత పాత్రపై ఆధారాలు దొరకడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం ఉదయం సికింద్రాబాద్‌లోని కార్యాలయానికి పిలిపించి, విచారించారు. నేరం అంగీకరించడంతోపాటు తావూస్, మునీర్ పేర్లు బయటపెట్టారు. ఈ హత్య వెనుక కాంగ్రెస్ నేత కుమారుడి పాత్రపైనా ఆరోపణలు ఉండటంతో ఆకోణంలోనూ విచారణ సాగుతోంది అని తెలియజేశారు.






