28 May, 2026 | 2:46 AM

బాలసదనం ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి చేయాలి

28-05-2026 02:07 AM

జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

సుల్తానాబాద్, మే 27 (విజయ క్రాంతి): ఈ నెల 29న ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు చేతుల మీదుగా బాల సదనం ప్రారంభానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని బాలసదనం, వృద్ధాశ్రమం, తహసీల్దార్ కార్యాలయాలను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆకస్మికంగా పరిశీలించారు,

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూబాలసదనం నిర్వహణ ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, చిన్నారులకు సౌకర్యవంతమైన మరియు భద్రమైన వాతావరణం కల్పించాలని కలెక్టర్ సూచించారు. అనంతరం వృద్ధాశ్రమాన్ని పరిశీలించిన కలెక్టర్ అక్కడి వసతులు, ఆహారం, పరిశుభ్రతపై వివరాలు తెలుసుకున్నారు. వృద్ధులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన సేవలు అందించాలని అధికారులకు సూచించారు.

సుల్తానాబాద్ తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్, పెండింగ్లో ఉన్న భూ భారతి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. మీ సేవా ద్వారా వివిధ ధృవపత్రాల కోసం వచ్చే దరఖాస్తులను సకాలంలో స్క్రూటినీ పూర్తి చేసి ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలని సూచించారు.తహసీల్దార్ కార్యాలయంలో మధ్యవర్తులకు ఎలాంటి అవకాశం ఉండదని స్పష్టం చేసిన కలెక్టర్, ప్రజలు తమ సమస్యలను నేరుగా తహసీల్దార్ దృష్టికి తీసుకువెళ్లాలని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత,జవాబుదారీతనం, ప్రజలకు సత్వర సేవలందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.ఈ పర్యటనలో బి.డబ్ల్యూ.ఓ. వేణుగోపాల్, సుల్తానాబాద్ తహసీల్దార్ బషీరోద్దీన్, పలువురు అధికారులు పాల్గొన్నారు.