దారులన్నీ అటువైపే
* తెలంగాణ అమర్నాథ్ యాత్రకు సర్వం సిద్ధం
* నేటి నుంచి భారీగా తరలిరానున్న భక్తులు
అచ్చంపేట: తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పిలిచే సలేశ్వరం ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం లింగాల మండలంలోని అప్పయ్య పల్లి పరిధిలోని నల్లమల్ల అభయారణ్యంలో ఆలయం ఉంది. ప్రతి ఏడాది ఉగాది పర్వదినం అనంతరం చైత్ర పౌర్ణమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. చెంచులే ప్రధాన పూజారులుగా నిర్వహించే వేడుకలకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక లోతోపాటు వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు భారీగా తరలివస్తారు. అమరాబాద్ పులుల అభయారణ్యంలో ఉండడంతో ఆ ప్రాంతమంతా అటవీశాఖ పరిధిలో ఉంటుంది.
దీంతో గతంతో పోలిస్తే ఈసారి ఉత్సవాలకు ఏప్రిల్ ఒకటి నుంచి మూడు వరకు నిర్వహించేందుకు అటవీశాఖ అనుమతులు ఇచ్చింది. ఇప్పటికే ఆ ప్రాంతంలో జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ ఆధ్వర్యంలో ఆయా శాఖ పరిధిలోని ఏర్పాట్లను పర్యవేక్షించారు. అలాగే వైద్యానికి శాఖ రెవెన్యూ అటవీ తోపాటు వివిధ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఉత్సవాల నిర్వహణకు కావలసిన వసతులను సమకూర్చారు. అత్యంత సాహసోపేతమైన సలేశ్వరం ఉత్సవాలను తెలంగాణ అమర్నాథ్గా పిలవడంతో శివ భక్తుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది.
గతంతో పోలిస్తే ఈసారి భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దానికి అనుగుణంగా కావలసిన వసతులను సమకూరుస్తున్నారు. ప్రధానంగా అటవీ శాఖ నిబంధనల మేరకే అడవిలోకి ప్రవేశించే అనుమతి ఉంటుందని ఇప్పటికే స్పష్టం చేశారు. ఆలయ మార్గం నీటి దేశానికి సంబంధించి స్పష్టమైన రూట్ మ్యాప్ ను ఇక్కడ విజయక్రాంతి ఆధ్వర్యంలో చూపించడం జరుగుతోంది. ఈ నిబంధన మేరకే భక్తులు యాత్రను కొనసాగించాల్సి ఉంటుంది.




