పార్టీలకతీతంగా మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకుందాం
* ప్రజలకు ఇచ్చిన హామీలను తీర్చడానికి కృషి చేయండి
* నీటి సమస్య లేకుండా ముందస్తు చర్యలు తీసుకోండి
* ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి
భూత్పూర్: పార్టీలకతీతంగా భూత్పూర్ మున్సిపాలిటీ అభివృద్ధి పథంలో నడిపించుకుందామని దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అన్నారు. మంగళవారం మున్సిపాలిటీ కార్యాలయంలో 2026 - 2027 సంవత్సరానికి వార్షిక బడ్జెట్ అంచనా పై చైర్మన్ మూడవత్ బాలకోటి అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జనరల్ బాడీ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిధులతో మున్సిపాలిటీ అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తూ ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చి దిద్దుతామన్నారు.
అందరం కలిసికట్టుగా వార్డులలో పెండింగ్లో ఉన్న పనులను చేస్తూ ప్రజల మన్ననాలు పొందాలని కోరారు. ప్రజల నుంచి వసూలు చేసే ప్రతి పైసా తిరిగి ప్రజల అవసరాలకే ఖర్చు చేయాలని సూచించారు. నిధులు దుర్వినియోగం కాకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు. మున్సిపాలిటీ కౌన్సిలర్లుగా ప్రజలు మీకు మంచి అవకాశం ఇచ్చారని ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకుండా చూసుకోవాలని కోరారు.
మున్సిపాలిటీ అభివృద్ధికి సంబంధించి ఇటీవలే 15 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకున్నామన్నారు. ఎండాకాలం దృష్టిలో ఉంచుకొని మున్సిపాలిటీలో నీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు, ప్రతినిధులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. నీటి సమస్యలను తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని దానికోసం ఎన్ని నిధులైన ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
మున్సిపాలిటీని దశలవారీగా అభివృద్ధి చేస్తా.... చైర్మన్ బాలకోటి
భూత్పూర్ మున్సిపాలిటీ దశల వారీగా అభివృద్ధి చేస్తానని మున్సిపల్ చైర్మన్ మూడవత్ బాలకోటి అన్నారు. 2026 - 2027 వార్షిక బడ్జెట్ను అంచనాలతో వివిధ అభివృద్ధి పనులకు పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. భూత్పూర్ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కౌన్సిలర్లు, అధికారులు సహకరించాలన్నారు.
బోడమోని చెరువును మినీ ట్యాంక్ బండ్ గా తీర్చిదిద్దాలి... కౌన్సిలర్ పద్మ నరేందర్
భూత్పూర్ మున్సిపాలిటీ పట్టణంలోని అమిస్తాపూర్ గ్రామంలో ఉన్న బొడమోని చెరువును మినీ ట్యాంక్ బండ్ గా తీర్చిదిద్దాలని కౌన్సిలర్ పద్మా నరేందర్ జనరల్ బాడీ సమావేశంలో తెలిపారు. అనంతరం మున్సిపాలిటీలో ఇంటి పన్నులు ఎక్కువగా వసూలు చేస్తున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని వెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే త్వరలోనే బొడమోని చెరువును మినీ ట్యాంక్ బండ్ గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానన్నారు. 5వ వార్డులో ఉన్న సమస్యలను త్వరలోనే పరిష్కరించాలని అధికారులను కోరారు. ఇంటి పనుల సమస్య లేకుండా ఇంటి కొలతలను మరోసారి చేసి ఇంటి పన్నులను తీసుకోవాలన్నారు.
కల్వర్టు నిర్మించాలి.... కౌన్సిలర్ శ్రీనివాసులు
ఆరో వార్డులో ఉన్న స్మశాన వాటికకు పోవడానికి దారి లేకపోవడంతో నాన్న ఇబ్బందులు పడుతున్నారని కల్వర్టు ఏర్పాటు చేయాలని కౌన్సిలర్ శ్రీనివాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని వెళ్లారు. 6వ వార్డులో డ్రైనేజీ, పాత విద్యుత్ స్తంభాలు, సీట్ లైట్లను ఏర్పాటు చేయాలని ఆయన ఎమ్మెల్యే ను కోరారు.
స్పందించిన ఎమ్మెల్యే స్మశాన వాటికకు వెళ్లేందుకు కల్వర్టును ఏర్పాటు చేస్తానని వార్డులో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ మూడవత్ బాలకోటి, వైస్ చైర్ పర్సన్ సూర్య కళ, మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ రావు, కౌన్సిలర్లు పద్మ నరేందర్, లాలూ నాయక్, శ్రీనివాసులు, గడ్డం ప్రేమ్ కుమార్, లత సూరన్న గారి, మాధురి, అన్నపూర్ణ, చంద్రకళ తో పాటు తదితరులు పాల్గొన్నారు.




