01-08-2025 11:49:04 PM
రిజర్వేషన్ల సాధనకు ఐక్యపోరాటం చేద్దాం
పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు పిలుపు
హైదరాబాద్ (విజయక్రాంతి): ‘బీసీల రిజర్వేషన్లు, సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద చేసిన ధర్నాలు, ఆందోళనలు చాలు.. ఇక ఢిల్లీలోనే తేల్చుకుందాం.. బీసీ సంఘాల నాయకులు పెద్దఎత్తున హస్తినకు తరలిరావాలి’ అని పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు(Former PCC President V. Hanumantha Rao) పిలుపునిచ్చారు. ఇప్పుడు విస్మరిస్తే బీసీలకు రిజర్వేషన్లు ఎప్పటికీ సాధ్యం కాదని, అందుకే అందరం కలిసి పోరాటం చేద్దామని ఆయన అన్నారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో పార్టీ సీనియర్ నేత ఆర్ లక్ష్మణ్‌యాదవ్‌తో కలిసి మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు కావడం ఖాయమని, కానీ దేశవ్యాప్తంగా అమలు చేసుకోవాల్సిన అవసరం ప్రతిఒక్కరిపై ఉందని వీహెచ్ పేర్కొన్నారు.
బీసీ రిజర్వేషన్ల కోసం ఈ నెల 5, 6, 7 తేదీల్లో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో పోరాటం చేస్తున్నట్టు తెలిపారు. 6వ తేదీన జంతర్ మంతర్ వద్ద చేపట్టే ధర్నాకు పెద్దఎత్తున హాజరుకావాలన్నారు. ఈ ధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు పాల్గొంటారని వెల్లడించారు. బీసీ రిజర్వేషన్లతో ముస్లింలకు మాత్రమే లబ్ధి జరుగుతుందని బీజేపీ చేస్తున్న వాదనల్లో వాస్తవం లేదని, అది పచ్చి అబద్ధమని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత్ జోడో యాత్ర చేపట్టి ప్రజల సమస్యలను తెలుసుకున్నారని వీహెచ్ గుర్తుచేశారు. గతంలో ఎస్సీ, ఎస్టీల సమస్యలపై దృష్టి పెట్టానని, ఇప్పుడు జనాభాలో సగానికిపైగా ఉన్న బీసీలకు న్యాయం చేసేందుకు పోరాటం చేస్తానని రాహుల్‌గాంధీ స్పష్టంగా చెప్పారని వీహెచ్ పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా బీసీల సమస్యలపై జంతర్ మంతర్ వద్ద ధర్నా జరుగుతుందన్నారు. ఈ సదావకశాన్ని బీసీలు చేజార్చుకోవద్దన్నారు.