01-08-2025 11:50:51 PM
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి
హైదరాబాద్ (విజయక్రాంతి): ప్రజల సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతోనే గాంధీభవన్‌లో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి(MLA Yashaswini Reddy) పేర్కొన్నారు. ప్రజల నుంచి ఎక్కువగా రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, భూ సమస్యలపై ఎక్కువగా దరఖాస్తులు వస్తున్నాయని తెలిపారు. ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి శుక్రవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికి తమ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను విడతల వారీగా మంజూరు చేస్తోందని చెప్పారు. గత బీఆర్‌ఎస్ పదేళ్ల కాలంలో ప్రజలకు రేషన్‌కార్డులు, ఇండ్లు ఇవ్వకుండా ప్రజలను మోసం చేసిందని ఆమె మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని ఒక్కొక్కటికి అమలు చేస్తూ ముందుకెళ్లుతోందని, సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. తన నియోజకవర్గం పాలకుర్తిలోనూ పల్లెబాట కార్యక్రమం మొదలు పెట్టినట్టు తెలిపారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ.. సేవ చేయడమే తన లక్ష్యమని తెలిపారు.