వరంగల్‌లో సర్వం సిద్ధం
వరంగల్ పశ్చిమలో 244, పరకాలలో 239 కేంద్రాలు
ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్
భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీస్ శాఖ
హనుమకొండ, మే 12 (విజయక్రాంతి): నేటి పార్లమెంట్ ఎన్నికల నిర్వ హణకు జిల్లా అధికార యంత్రాంగం సిద్ధమైంది. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ వరంగల్ ఏనుమాముల మార్కె ట్ యార్ట్‌లో భద్రపర్చిన ఈవీఎం బాక్సులను ఆదివారం పరిశీలించారు. ఎన్నికల సిబ్బందికి అందజేసే పోలింగ్ సామగ్రి పంపిణీ, రిసెప్షన్ కేంద్రాల పనితీరును పర్యవేక్షించారు. వరంగల్ పశ్చిమ, పరకాల నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు, పోలింగ్ సామగ్రి పంపిణీ వివరాలు స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడు తూ సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని చెప్పారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల కోసం వివిధ సదుపాయాలు కల్పించినట్లు ఆమె పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద షెడ్ నెట్, త్రాగునీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు లాంటి వసతులు కల్పించినట్లు వివరించారు.
ఓటు హక్కు వినియోగించుకోవాలి
ఓటర్లు తప్పకుండా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 2,83,446 ఓటర్లకు గానూ 244 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరకాల నియోజకవర్గంలో 2,22,383 మంది ఓటర్లకు గానూ 239 పోలింగ్ కేంద్రా లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసిన ట్లు ఆమె పేర్కొన్నారు.
పోలింగ్ కేంద్రాలకు
తరలిన సిబ్బంది
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ దృష్ట్యా పోలింగ్ సిబ్బంది వరంగల్ పశ్చిమ, పరకాల నియోజకవర్గాల పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లారు. భారీ పోలీస్ భద్రత మధ్య ఈవీఎంలు, పోలింగ్ సామగ్రి తరలించారు. ఈ మేరకు పరకాల ఏఆర్‌ఓ కే నారాయణ, ఏసీపీ కిషోర్ కుమార్ జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు.




