11 April, 2026 | 9:38 AM

జనగామలో 869 కేంద్రాలు

13-05-2024 01:46 AM

పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి

జనగామ, మే 12 (విజయక్రాంతి) : పార్లమెంటు ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నేడు జనగామ జిల్లాలోని మూడు సెగ్మెంట్లలో 869 పోలింగ్ బూత్‌లలో పోలింగ్ జరగనుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాలో 4,132 మంది అధికారులను ఎన్నికల విధుల్లో నియమించారు. జిల్లాలోని జనగామ సెగ్మెంట్ భువనగిరి పార్లమెంటు పరిధిలో ఉండగా, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్ సెగ్మెంట్లు వరంగల్ పార్లమెంటు పరిధిలో ఉన్నాయి. జనగామలో 2,42,771, స్టేషన్‌ఘన్‌పూర్‌లో 2,54,110, పాలకుర్తిలో 2,55,514 మంది ఓటర్లు ఉన్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు పూర్తి కానుంది. ప్రతీ రెండు గంటలకోసారి పోలింగ్ శాతాన్ని తెలుసుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని జనగామ, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఎన్నికల సామగ్రి కేంద్రాన్ని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పరిశీలించారు. జనగామ సెగ్మెంట్‌కు 1,046 బ్యాలెట్ యూనిట్లు, 394 కంట్రోల్ యూనిట్లు, 395 వీవీ ప్యాట్లు, స్టేషన్‌ఘన్‌పూర్ సెగ్మెంట్‌కు 1,120 బ్యాలెట్ యూనిట్లు, 418 కంట్రోల్ యూనిట్లు, 423 వీవీ ప్యాట్లు, పాలకుర్తి సెగ్మెంట్‌కు 1,122 బ్యాలెట్ యూనిట్లు, 420 కంట్రోల్ యూనిట్లు, 422 వీవీ ప్యాట్లు కేటాయించారు. 60 మంది మైక్రో అబ్జర్వర్లతో పాటు 103 సెక్టార్ అధికారులను నియమించారు.

12 రకాల గుర్తింపు కార్డుల అనుమతి

పోలింగ్ బూత్‌లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు 12 రకాల గుర్తింపు కార్డులను అనుమతిస్తున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. ఎపిక్ కార్డు లేని వారు ఆధార్, ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ జాబ్ కార్డు, బ్యాంకు, పోస్టు ఆఫీసు జారీ చేసిన పాస్‌బుక్‌లు, కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, పాన్ కార్డు, ఎన్‌పీఆర్ కింద ఆర్‌జీఐ జారీ చేసిన స్మార్ట్‌కార్డు, పాస్‌పోర్టు, ఫొటోతో ఉన్న పింఛన్ డాక్యుమెంటు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పీఎస్‌యూలు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల ఐడీ కార్డులు, ప్రత్యేక వైకల్యం ఐడీ కార్డులను చూపించి ఓటు హక్కును వినియోగించుకోవచ్చని స్పష్టం చేశారు.