30 June, 2026 | 2:10 AM

ఎస్‌ఐఆర్‌పై అన్ని పార్టీల దృష్టి

30-06-2026 12:00 AM

కరీంనగర్, జూన్ 29 (విజయక్రాంతి): కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ(ఎస్ ఐ ఆర్) కార్యక్రమంపై అన్ని రాజకీయ పార్టీలు తమ పూర్తి దృష్టిని కేంద్రీకరించాయి. జూన్ 25 నుండి ప్రారంభమైన ఈ ప్రక్రియ ద్వారా దొంగ ఓట్లు, మరణించిన వారి ఓట్లను తొలగించి పకడ్బందీ ఓటరు జాబితాను రూపొందించడమే లక్ష్యంగా అధికారులు ఇళ్లకు వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తు ఎన్నికల్లో గెలుపోటములను శాసించే ఓట్ల తొలగింపు , కొత్త ఓట్ల నమోదు ప్రక్రియ కావడం వల్ల కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్, ఎం ఐ ఎం పార్టీలు ఈ సర్వేను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 

ఓటరు జాబితా సవరణలో ఏ ఒక్క అర్హుడైన ఓటరు పేరు గల్లంతు కాకూడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ శ్రేణులు, ఎమ్మెల్యేలకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. బూత్ స్థాయి ఏజెంట్లను  నియమించి గ్రౌండ్ లెవల్లో ఓట్లను పర్యవేక్షిస్తున్నారు.కరీంనగర్ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సహా స్థానిక బీజేపీ నేతలు ఈ ప్రక్రియను సమర్థిస్తూ, బూత్ల వారీగా పార్టీ కార్యకర్తలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. అక్రమ ఓట్లను ఏరివేయడమే లక్ష్యంగా బీజేపీ బూత్ స్థాయి ప్రతినిధులను మోహరించింది.బీఆర్‌ఎస్  పార్టీ సైతం తమకు పట్టున్న కరీంనగర్ జిల్లాలో అధికార పార్టీకి లబ్ధి చేకూరేలా అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకుండా ఉండేందుకు తమ బూత్ లెవెల్ ఏజెంట్లను అప్రమత్తం చేసింది. ఆయా జిల్లాల కలెక్టర్లు రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి ఓటరు జాబితా ప్రక్షాళనకు సహకరించాలని కోరారు.    

షెడ్యూల్: ఇంటింటి సర్వే జూన్ 25 నుండి జూలై 24 వరకు బూత్ లెవెల్ అధికారులు  ప్రతి ఇంటిని సందర్శించి వివరాలను సేకరిస్తారు.ముసాయిదా ఓటరు జాబితా: జూలై 31న  ప్రకటిస్తారు.అభ్యంతరాల స్వీకరణ: జూలై 31 నుండి ఆగస్టు 30 వరకు ఏవైనా తప్పులు ఉంటే సవరించుకోవడానికి, అభ్యంతరాలు తెలపడానికి అవకాశం ఉంటుంది. : అన్ని అభ్యంతరాలను పరిష్కరించి అక్టోబర్ 1, 2026 న అధికారికంగా తుది ఓటరు జాబితాను ప్రచురిస్తారు.