ప్రజలందరూ ఐక్యంగా నిలిచి, బాధితులకు అండగా ఉండాలి: కేటీఆర్
హైదరాబాద్: హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని గుల్జార్ హౌస్(Gulzar House) వద్ద జరిగిన అగ్నిప్రమాదంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) స్పందించారు. అగ్నిప్రమాద ఘటన వివరాలు తెలిసి అత్యంత షాక్‌కు గురయ్యానని తెలిపారు. ఈ విషాద ఘటన చాలా హృదయవిదారకంగా ఉందని, ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని, ఈ అగ్నిప్రమాదం త్వరగా అదుపులోకి రావాలని ఆశిస్తూ ప్రార్థిస్తున్నానని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని క్షతగాత్రులకు మెరుగైన ఉచిత చికిత్స అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు ఈ సంక్షోభ సమయంలో అవసరమైన ఏ సహాయానికైనా అందుబాటులో ఉంటారని సూచించారు.
ఈ ఘటనలో బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు బీఆర్‌ఎస్ పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు అధికారులతో కలిసి పనిచేస్తారని తెలిపారు. స్థానిక బీఆర్ఎస్ పార్టీ నేతలకు ప్రమాద స్థలం వద్ద సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని కేటీఆర్ సూచించారు. ఈ అగ్నిప్రమాదానికి కారణాలను ప్రభుత్వం లోతుగా విచారించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. బాధిత కుటుంబాలకు తగిన నష్టపరిహారం ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ఓల్డ్ సిటీతో పాటు హైదరాబాద్ నగరంలో అగ్ని భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయాలని, అగ్నిమాపక శాఖ సామర్థ్యాన్ని పెంచాలని సూచించారు. ఈ విషాద సమయంలో హైదరాబాద్ ప్రజలందరూ ఐక్యంగా నిలిచి, బాధితులకు అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.






