ముఖ్యమైన ప్రాజెక్టులన్నీ మా హయాంలోనే..
ఓఆర్‌ఆర్, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌తో మారిన హైదరాబాద్
ట్రిపుల్‌ఆర్‌ను కేసీఆర్ సర్కారు పట్టించుకోలేదు
డిసెంబర్ నాటికి హైదరాబాద్ హైవే పూర్తి
ఆర్‌అండ్‌బీ పనుల పురోగతిపై సమీక్షలో మంత్రి కోమటిరెడ్డి
హైదరాబాద్, జూన్ 19 (విజయక్రాంతి): ఈ ఏడాది చివరి నాటికి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి (ఎన్‌హెచ్ విస్తరణ పనులు పూర్తయ్యేలా చూస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం సచివాలయంలో రాష్ట్ర, జాతీయ రహదారులు, భవనాల నిర్మాణాలపై సమీక్ష నిర్వహించిన మంత్రి అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ముఖ్యమైన ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ హయాంలోనే వచ్చాయని తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు, శంషాబాద్ విమానాశ్రయంతో నగరం రూపురేఖలే మారిపోయాయని పేర్కొన్నారు.
ట్రిపుల్ ఆర్‌ను కేసీఆర్ విస్మరించినట్లు కేంద్ర మంత్రి చెప్పారని మంత్రి విమర్శించారు. యుటిలిటీ ఛార్జీల విషయంలోఆ ప్రాజెక్టు కొంతకాలం ఆగిందని, ఆ ఛార్జీలు భరించేందుకు తాము సిద్ధపడటంతో మళ్లీ కదలిక వచ్చిందని పేర్కొన్నారు. ట్రిపుల్ ఆర్‌ను త్వరగా పూర్తి చేస్తామని వెల్లడించారు. నాగ్‌పూర్ మంచిర్యాల హైవే నిర్మాణంపైనా కేంద్రంతో చర్చించినట్లు తెలిపారు. విజయవాడ హైదరాబాద్ హైవేను డెత్ రోడ్డుగా కేంద్రమంత్రి గడ్కరీ పేర్కొన్నారని, దీనిపై 17 బ్లాక్ స్పాట్లను గుర్తించి మరమ్మతులు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు ఆలస్యానికి కాంట్రాక్టరే కారణమని పేర్కొన్నారు. ఈ నెల 25, 26 తేదీల్లో ఢిల్లీలో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, భూపేంద్ర యాదవ్‌తో సమావేశమై జాతీయ రహదారుల అనుమతులు, నిధులు, అటవీ అనుమతులపై చర్చించనున్నట్లు చెప్పారు.
ప్రమాదాలకు నిలయమవ్వడం బాధాకరం...
అంతకు ముందు సచివాలయంలో రోడ్లు, భవనాల నిర్మాణ పురోగతిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. దేశంలో అత్యధిక ప్రమాదాలు జరుగుతున్న రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు ముందుండటం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. రోడ్లు చెడిపోతే కాంట్రాక్టర్లతో పాటు అధికారులు సైతం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. తాను 24 గంటలు అదుబాటులో ఉంటానని, రోడ్లు బాగోలేక ప్రజలు ఎక్కడా ఇబ్బందులు పడవద్దని అధికారులకు సూచించారు.
ప్రజలకు మెరుగైన రోడ్లను అందించడమే మన లక్ష్యం కావాలన్నారు. ఆర్‌ఆర్‌ఆర్ వల్ల రెట్టింపు పెట్టుబడులు వచ్చి అభివృద్ధి జరుగబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఔటర్ రింగ్ రోడ్డుకు ట్రిపుల్ ఆర్‌కు మధ్య రేడియల్ రోడ్లు నిర్మించాలని ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి (ఎన్ హెచ్ గ్రీన్ ఫీల్డ్ హైవేగా నిర్మాణం కోసం ముందుకు వెళ్తున్నామన్నారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు ఏండ్లుగా నత్తనడకన సాగడంపై అధికారులను మంత్రి ప్రశ్నించారు. అంబర్ పేట్ ప్లుఓవర్ పనులు త్వరలో పూర్తి అవుతాయని మరో నెల రోజుల్లో ట్రాఫిక్‌కు అనుమతిస్తాని ఈఎన్సీ మంత్రికి వివరించారు.






