ఖాకీచకులు
- పోలీసు శాఖకు మచ్చగా మారుతున్న అక్రమార్కులు
అధికారం మదంతో మితిమీరుతున్న వైనం
ఏంచేసినా చెల్లుతుందన్న నైజం
భూదందాలు, వసూళ్లు స్త్రీలపై అఘాయిత్యాలు
చర్యలు తీసుకున్నా మార్పు శూన్యం
గలీజు పనులతో వరంగల్ పోలీస్ బ్రాండ్ బజారుపాలు
శాశ్వత పరిష్కారమెప్పుడో?
హనుమకొండ, జూన్ 19 (విజయక్రాంతి): కొంతమంది పోలీసుల తీరు ఆ శాఖకే మచ్చ తెచ్చేలా ఉంది. అధికారం చేతి లో ఉంది కదా..? ఏం చేసినా చెల్లుతుందిలే అనే ధీమా ఓరుగల్లు పోలీస్ శాఖ బ్రాండ్‌ను బజారుపాలు చేస్తోంది. ఉద్యోగంలో చేరిన నాడు చేసిన ప్రతిజ్ఞలను మరిచి స్వలాభం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. అక్రమార్కులతో చేతులు కలిపి అమాయకులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. దౌర్జన్యాలు, భూదందాలు, వసూళ్లు, అవినీతి అక్రమాలు, లైంగిక దాడులు లాంటి ఘటనలకు పాల్పడుతున్నారు.
ప్రధానంగా భూవివాదాల్లో జోక్యం చేసుకుని నియమనిబంధన లు తుంగలో తొక్కుతున్నారు. డబ్బులు ఇచ్చిన వారికి వత్తాసు పలుకుతున్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారిపై ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నా వారిలో మార్పు రావడం లేదు. ఈ నేపథ్యంలో పోలీసుల వ్యవహార శైలిపై ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
పరువుపోయే పనులు!
పోలీసులంటే సమాజంలో ప్రత్యేకమైన గౌరవం ఉంది. ప్రజల మానప్రాణాలు కాపాడాల్సిన రక్షకభటులు భక్షకులుగా మారుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది పోలీసుల వ్యవహార శైలితో పోలీస్‌స్టేషన్ మెట్లెక్కాలంటే మహిళలు జంకుతున్నారు. వారి భాష, యాసతో ఇబ్బందులు పడిన ఘటనలు అనేకం ఉన్నాయి. గత ఆరు నెలల కాలంలో కొంతమంది పోలీసుల వ్యవహారశైలి గమనిస్తే నమ్మలేని వాస్తవాలు వెలుగు చూసాయి.
- గతంలో కేయూ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్సై అనిల్ మరో ప్రభుత్వశాఖలో పనిచేస్తున్న ఉద్యోగిని వేధించాడు. ఆమె భర్త సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీంతో ఎస్సైని అక్కడ నుంచి తప్పించి వీఆర్‌కు అటాచ్ చేశారు.
- ఆత్మకూరు పని చేస్తున్న ఎస్సై ప్రసాద్ బీఆర్‌ఎస్ నాయకులపై చెయ్యి చేసుకున్నాడు. దీనిపై వారు అధికారులకు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపి సదరు ఎస్సైని సస్పెండ్ చేశారు.
- ఐనవోలు పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్సై నవీన్ గంజాయి కేసు నమోదు విషయంలో నిర్లక్ష్యం వ్యవహరించడంతో సస్పెండ్ అయ్యారు.
- హనుమకొండ ట్రాఫిక్ ఎస్సైగా పనిచేస్తున్న డేవిడ్ వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. విచారణ జరిపిన ఉన్నతాధికారులు ఎస్సైని సస్పెండ్ చేశారు.
- మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పోలీస్ స్టేషన్‌లో పనిచేసే ఇద్దరు కానిస్టేబుళ్లు ఇసుకు లారీ డ్రైవర్‌ను రోడ్డుపై విపరీతంగా కొట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఘటనపై విచారణ జరిపిన అధికారులు వారిని సస్పెండ్ చేశారు.
ఖాకీచకులు..!
భూపాలపల్లి జిల్లాలో వరుస ఘటనలు కలకలం రేపుతున్నాయి. కొద్దిరోజుల కిందట జిల్లాకు చెందిన సైబర్ క్రైం సీఐ బండారి సంపత్ పోక్సో కేసులో అరెస్టయ్యాడు. దీంతో ఆయన్ను సస్పెండ్ చేస్తూ మల్టీజోన్ 1 ఐజీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. సీఐ గతంలో వరంగల్ కమిషనరేట్ పరిధిలోని కేయూసీ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహించిన సమయంలో ఓ మహిళతో సన్నిహితంగా మెలిగారు. ఆమె 16 ఏళ్ల కూతురిపై కన్నేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించడంతో కేయూసీ పోలీసులు విచారణ జరిపారు.
సంపత్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. తాజాగా కాళేశ్వరం ఎస్సై భవానీ సేన్ తన ఠాణాలో పనిచేస్తున్న కానిస్టేబుల్‌పై వరుస అత్యాచారాలకు పాల్పడటం సంచలనం రేపింది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం అతడిని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసింది. ఈ మేరకు ఖాకీచకుడిపై కేసు నమోదు చేసిన అధికారులు అతడిని రిమాండ్‌కు తరలించారు.
టాస్క్‌పోర్స్‌లో ఇష్టారాజ్యం?
వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో నేరాల నియంత్రణకు ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్ విభాగంలో కొంతమంది అధికారులు, సిబ్బంది తీరు వివాదాస్పదమవుతోంది. అధికారులు, సిబ్బంది నేరాలను అదుపు చేయాల్సింది పోయి మామూళ్ల మత్తులో మునిగి తేలుతున్నట్లు సమాచారం. పీడీఎస్ బియ్యం, గుట్కా, ఇసుక మాఫియాల నుంచి నెలవారీగా మామూళ్లు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరిష్కారం కానీ కేసుల విచారణ పేరిట అమాయకులను బెదిరించి చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఆరు నెలల కిందట కాజీపేటలో ఓ వృద్దురాలి హత్య కేసులో సుమారు 70 మంది సాక్షులను విచారించిన టాస్క్‌ఫోర్స్ ఇన్స్‌పెక్టర్ అసలు నేరస్థులను కనిపెట్టకుండా అమాయకులను ఇబ్బంది పెట్టినట్లు విమర్శలున్నాయి.
విచారణ పేరిట అమాయకులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడంతో పాటు చెప్పరాని మాటలతో దూర్భాషలాడినట్లు ప్రచారం జరుగుతోంది. చేయని నేరాన్ని ఒప్పుకోవాలంటూ లేదంటే ఎన్‌కౌంటర్ చేస్తానంటూ పలువురి యువకులను బెదిరించినట్లు సమాచారం. దీంతో బాధితులు సదరు అధికారులపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. పోలీస్‌శాఖలో ఒకటి రెండు మినహా వెలుగులోకి రాని ఘటనలు అనేకం చోటుచేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి ఆకృత్యాలకు శాశ్వత పరిష్కారం ఎప్పుడు లభిస్తోందోననే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.






