17 May, 2026 | 4:32 PM

3 ఏండ్లు.. రూ.3 వేల కోట్లు!

20-06-2024 01:10 AM

పెండింగ్‌లో ఫీజు రీయింబర్స్‌మెంట్ 

జూనియర్, డిగ్రీ, పీజీ కాలేజీలకు బకాయి 

సర్టిఫికెట్లకు మెలిక పెడుతున్న విద్యాసంస్థలు

పెండింగ్ ఫీజులతో ఆర్థికభారంలో యాజమాన్యాలు

రూ.750 కోట్ల టోకెన్లకు పైసా విదిల్చని సర్కారు

హైదరాబాద్, జూన్ 19 (విజయక్రాంతి): నూతన విద్యాసంవత్సరం ప్రారంభమైనా గత విద్యాసంవత్సరాలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేత నాలు ఇంత వరకూ విడుదల కాలేదు. దీంతో ఇటు విద్యార్థులు అటు కళాశాలల యాజమాన్యాలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఏడాదికేడాది చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో అవి భారీగా పేరుకుంటున్నాయి. సకాలంలో బకాయిలు విడుదల చేయకపోవడం తో విద్యార్థులపై ప్రైవేట్ యాజమాన్యాలు ఫీజులపై ఒత్తిడి చేస్తున్నా యి. అలా అయితేనే సర్టిఫికెట్లు ఇస్తామని మెలిక పెడుతుండటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. నాన్ ప్రొఫెషనల్ కళాశాలలైన జూనియర్, డిగ్రీ, పీజీ కాలేజీలకు గత మూడేళ్లుగా దాదాపు రూ.3వేల కోట్లు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి.

ఏడాదికి దాదాపు రూ.వెయ్యి కోట్లు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా సుమారు రూ.2500 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి కేటాయిస్తోంది. అయితే ఇందులో ప్రొఫెషనల్ కాలేజీలు మినహా నాన్ ప్రొఫెషనలైన జూనియర్ కాలేజీలు, డిగ్రీ, పీజీ కాలేజీల్లో చదివే విద్యార్థులకు చెల్లించేంది 40 శాతం నిధులే. అంటే సుమారు రూ.వెయ్యి కోట్లు ఈ కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి కేటాయిస్తోం ది. ఈక్రమంలోనే 2021 2022 2023 సంవత్సరాలకు రూ.3వేల కోట్లు బకాయిలు ఉన్నాయని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. అయితే ఇప్పటి వరకు ఇందులో రూ.750 కోట్లకు మాత్ర మే ప్రభుత్వం టోకెన్లను విడుదల చేసింది. టోకెన్లను జారీ చేసిన సర్కారు వాటికి నిధులను మాత్రం విడుదల చేయలేదు. నాన్ ప్రొఫెషనల్ కాలేజీలకు చెల్లించాల్సిందే రూ.3 వేల కోట్లు. అదే పీహెచ్‌డీ, వృత్తివిద్యాకోర్సులను అందించే ప్రొఫిషనల్ కాలేజీలను కలుపుకుంటే మొత్తం సుమారు ఏడు వేల కోట్లకు పైగా బకాయిలు ఉంటుందని ప్రైవేట్ యాజమాన్యాలు పేర్కొంటున్నాయి.

విద్యార్థుల ఉన్నత విద్యపై ప్రభావం

జూనియర్, డిగ్రీ, పీజీ కాలేజీల్లోని దాదాపు 8.45 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాల ద్వారా లబ్ధిపొందుతున్నారు.  ఈ నిధులను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో వీరంతా ఆందోళన చెందుతున్నారు. ఫీజు చెల్లించలేని కారణంగా ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు పరీక్షలు రాయనీయడంలేదు. నూతన విద్యాసంవత్సరం ప్రారంభంకావడంతో ఇంటర్ నుంచి డిగ్రీకు, డిగ్రీ నుంచి పీజీకు ఉన్నత విద్య చదవాలనుకునేవారికి ధ్రువపత్రాలు అవసరం. ధ్రువపత్రాల కోసం కళాశాలలకు వెళ్లే విద్యార్థులకు ఫీజు కడితేనే వాటిని ఇస్తామని యాజమాన్యాలు తెగేసి చెప్తుండడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కొందరు అప్పులు చేసి ఫీజు చెల్లిస్తుండగా, కొంత మంది మధ్యలోనే చదువును ఆపేస్తున్నారు. ఇంకొంత మంది మాత్రం ఇక చేసేదిలేక ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల కార్యాలయాల చుట్టూ తిరిగి వారితో ఫోన్‌లు చేయించుకొని అవసరమైన(మొత్తం కావు) ధ్రువపత్రాలను తీసుకొని వెళ్తున్నారు.

కళాశాలలపై పడుతున్న భారం

ప్రభుత్వం సమయానికి ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకపోవడంతో కళాశాలలపై భారం పడుతోంది. నిర్వహణ భారంతో కళాశాలలు మూతపడే పరిస్థితికి చేరుకుంటున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాలను వాయిదాల పద్ధతిలో చెల్లిస్తారు. విద్యాసంవత్సరం ప్రారంభంలో 25 శాతం, మధ్యలో 50 శాతం, విద్యాసంవత్సరం చివరలో మిగిలిన 25 శాతం చెల్లిస్తారు. గత ప్రభుత్వంతోపాటు, ఈ ప్రభుత్వం కూడా ఈ విధానాన్ని పాటించకపోవడంతో బకాయిలు భారీగా పెరిగిపోతున్నాయి. దీంతో కళాశాలల్లో పనిచేసే సిబ్బందికి వేతనాలు, బిల్డింగ్ కిరాయి, పన్నులు కట్టలేని పరిస్థితి ఏర్పడుతోందని యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.


ఫీజు బకాయిలు విడుదల చేయాలి

  • డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్యాల సంఘం డిమాండ్ 
  • ఇందిరాపార్క్ వద్ద శాంతి దీక్ష నిర్వహణ

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 19 (విజయక్రాంతి): మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో రాష్ట్రంలోని ప్రైవేటు డిగ్రీ కళాశాలలు మూతపడే స్థితికి వచ్చాయని తెలంగాణ ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ బొజ్జ సూర్యనారాయణ, యాద రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆ సంఘం ఆధ్వర్యంలో యజమానులు ఇందిరాపార్క్ వద్ద బుధవారం శాంతిదీక్ష చేశారు.

ప్రభుత్వం ఏటా సుమారు రూ.2,500 కోట్లు రీయంబర్స్‌మెంట్ కోసం కేటాయిస్తున్నదని, అందులో జూనియర్, డిగ్రీ, పీజీ విద్యార్థులకు చెల్లించేది కేవలం రూ.1,000 కోట్లు (40 శాతం) మాత్రమేనని చెప్పారు. 2021 వరకు మూడు విద్యా సంవత్సరాలకు సంబంధించిన బకాయిలు రూ.3 వేల కోట్లు ఉంటాయన్నారు. ఫీజు రీయంబర్స్‌మెంట్ , స్కాలర్‌షిప్స్ బకాయిలను విడుదల చేసి యాజమాన్యాలు, విద్యార్థులను ఆదుకోవాలని కోరారు. తమకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని, తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికే ‘శాంతి దీక్ష’ చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో యాజమాన్యాల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీధర్‌రావు, పరమేశ్వర్, కోశాధికారి శంకర్, కళాశాలల యాజమాన్యాలు భారీగా హాజరయ్యారు.