calender_icon.png 13 November, 2025 | 4:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏ మద్యం బ్రాండ్‌కు పర్మిషన్ ఇవ్వలె

30-07-2024 12:55:24 AM

సంబంధిత శాఖ మంత్రి కూడా స్పష్టత ఇచ్చారు

శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు 

పాడి కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలపై అసెంబ్లీలో దుమారం

హైదరాబాద్, జూలై 29(విజయక్రాంతి): రాష్ట్రంలో ఏ కొత్త మద్యం బ్రాండుకు ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టంచేశారు. గతంలో ఇదే విషయాన్ని సంబంధింత శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా పత్రికా ముఖంగా చెప్పారని గుర్తుచేశారు. అయినా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అదే విషయాన్ని మళ్లీ లేవనెత్తడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైనా ఆరోపణ చేసినప్పుడు స్పష్టతతో, ఆధారాలతో మాట్లాడాలని హితవు పలికారు.

సోమవారం బడ్జెట్‌పై చర్చ సందర్భంగా.. ఆర్టీసీ, ఎక్సైజ్ శాఖలపై పాడి కౌశిక్‌రెడ్డి మాట్లాడారు. సభలో ఆయన మాటలు, వ్యవహరించిన తీరుతో దుమారం రేగింది. చివరకు స్పీకర్ కూడా ఆయనకు చురకలంటించడం గమనార్హం. తెలంగాణ ప్రభుత్వం, మధ్యప్రదేశ్‌కు చెందిన మద్యం కంపెనీ మధ్య డీల్‌పై చర్చ జరిగిందని, సంబంధిత మంత్రికి తెలియకుండానే, సీఎం రేవంత్‌రెడ్డితో మధ్యప్రదేశ్ మాజీ సీఎం మంతనాలు జరిపారని కౌశిక్‌రెడ్డి అనడంపై గందరగోళం ఏర్పడింది.

ఈ విమర్శలపై మంత్రి శ్రీధర్ బాబు కౌశిక్‌రెడ్డి తీరును తప్పుబట్టారు. కొత్తగా వచ్చిన శాసనసభ్యుడు అన్ని విషయాలను తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎంతో రేవంత్‌రెడ్డి మాట్లాడింది కౌశిక్‌రెడ్డి ఏమైనా చూశారా? ఆయన ఏమైనా విన్నారా? అంటూ ప్రశ్నించారు. కౌశిక్‌రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడం అనేది ఆయన తప్పు కాదని, ఆయన పక్కన కూర్చున్న కేటీఆర్ ప్రమేయంతో ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు.

కౌశిక్‌రెడ్డి.. నీది దుర్మార్గపు నాలెడ్జ్: మంత్రి సీతక్క

ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటోడ్రైవర్లు ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఆటో డ్రైవర్లకు నెలకు రూ.10 వేలు ఇవ్వాలని ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేశారు. బస్సులు సరిపోవట్లేదని, కొత్త బస్సులు వేయాలని కోరారు. కాగా, కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి సీతక్క స్పందించారు. కౌశిక్‌రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, ఒకవైపు బస్సులు పెంచమంటూనే, మరోవైపు ఆటో డ్రైవర్లు నష్టపోతున్నారని అనడం విడ్డూరంగా ఉందన్నారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆర్టీసీపై బీఆర్‌ఎస్ వైఖరి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. సీతక్క వ్యాఖ్యలపై కౌశిక్‌రెడ్డి స్పందించారు. ట్రాన్స్‌పోర్టులోని 10 లక్షల మందికి 5 లక్షల ఇన్సురెన్స్ చేశామని చెప్పారు. ఈ అంశంపై సీతక్క నాలెడ్జ్ లేకుండా మాట్లాడుతున్నారని అనడంతో సీతక్క ఫైర్ అయ్యారు. ‘నీలాంటి దుర్మార్గపు నాలెడ్జ్ నాకు లేదు. ఓట్ల కోసం చస్తా అని బ్లాక్ మెయిల్ చేసే నాలెడ్జ్ నాకు లేదు. మా పథకానికి ఆటో డ్రైవర్లకు లింకు పెట్టడం కరెక్టు కాదు’ అని  అన్నారు.

అభివృద్ధి కేంద్రీకరణ సరికాదు: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వివేకానందగౌడ్

కార్పొరేషన్లకు అధికంగా నిధులు ఇవ్వాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వివేకానందగౌడ్ డిమాండ్ చేశారు. అధికార వికేంద్రీకరణ చేయాల్సింది పోయి.. కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో అధికార కేంద్రీకరణ చేస్తోందని మండిపడ్డారు. రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని, రియల్టర్ల ప్రోత్సాహకానికి చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా వీధికుక్కల బెడద ఎక్కువ ఉందని, నివారణకు చర్యలు తీసుకోవాలని అన్నారు. బీసీ వర్గాల సంక్షేమానికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.

మున్సిపాలిటీలకు నిధులు విడుదల చేయాలి: బీజేపీ ఎమ్మెల్యే ధన్‌పాల్  

మున్సిపాలిటీల్లో నిధులు లేక ఇబ్బందులు పడుతున్నట్టు బీజేపీ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ సభ దృష్టికి తీసుకొచ్చారు. మున్సిపాలిటీలకు కేంద్రం నిధులు ఇస్తున్నా రాష్ట్రం ఇవ్వడం లేదని ఆరోపించారు. సొమ్ము కేంద్రానిది.. సోకు రాష్ట్రానికి అన్న చందంగా మారిందని ఎద్దేవాచేశారు. కేంద్రం అమలు చేస్తున్న అమృత్ పథకం నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలని కోరారు. రక్షణ భూములను రాష్ట్రానికి ఇచ్చేందుకు అంగీకరించిన కేంద్రాన్ని అభినందిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. తన నియోజకవర్గానికి రావాల్సిన స్పెషల్ ఫండ్ ఆగిపోయిందని ఆరోపించారు.

భూములు అమ్మారు.. అభివృద్ధి మరిచారు: ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి

గత ప్రభుత్వంలో రంగారెడ్డి, హైదరాబాద్‌లోని భుములు అమ్ముకున్నారు.. కానీ అభివృద్ధి చేయలేదని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఆరోపించారు. గత పదేళ్లలో పారిశుద్ధ్యం, తాగునీరు సరిగా లేదని విమర్శించారు. హైదరాబాద్‌లో ఓఆర్‌ఆర్, ఎయిర్‌పోర్టు కాంగ్రెస్ హయాంలోనే వచ్చాయని గుర్తుచేశారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కృష్టి చేయాలని కోరారు. అలాగే, మెట్రోను హయత్ నగర్ తర్వాత వచ్చే ఓఆర్‌ఆర్ వరకు పొడిగించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మాసిటీని రద్దు చేసి.. అక్కడ 20వేల ఎకరాల్లో అందమైన టౌన్ షిప్‌ను తీసుకురావడం అభినందనీయమన్నారు.

ఇండస్ట్రీలకు రాయితీలు ఇవ్వాలి: మర్రి రాజశేఖర్ రెడ్డి

ఫార్మా సిటీని ముచ్చర్లలో ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి కోరారు. తలసరి ఆదాయంలో తెలంగాణ మెరుగైన స్థితిలో ఉందని చెప్పారు. చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించాలని కోరారు. హెచ్‌ఎంటీ, ఐటీపీఎల్ భూముల్లో ఎక్కడైనా స్కిల్ సిటీని ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ ఉండట్లేదని, దీనిపై దృష్టి పెట్టాలని స్పీకర్‌ను కోరారు. 

బీఆర్‌ఎస్ పాలనలో బెల్ట్ షాపులు రెండింతలు: ఎమ్మెల్యే రామ్‌చంద్రూ నాయక్

బీఆర్‌ఎస్ పాలనలో బెల్ట్ షాపులు రెండింతలు పెరిగాయని డోర్నకల్ ఎమ్మెల్యే రామ్‌చంద్రూ నాయక్ ఆరోపించారు. గత పదేళ్లలో సమస్యలు గుట్టలుగా పేరుకుపోయాయన్నారు. సమస్యల గురించి బీఆర్‌ఎస్ మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందన్నారు. గత పదేళ్లలో సర్పంచ్‌లు చేసిన పనులకు బిల్లులు చెల్లించలేదని, కేసీఆర్ పాలనలో రాజ్యంగ విలువలను తుంగలో తొక్కారని విరుచుకుపడ్డారు.