calender_icon.png 13 November, 2025 | 5:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పల్లెల్లో వీడీసీల పెత్తనం!

30-07-2024 12:53:39 AM

  1. సమాంతర పాలన నడిపిస్తున్న కమిటీలు 
  2. పంచాయితీలు, జరినామాతో పెట్రేగుతున్న పెద్దలు
  3. మాట వినకపోతే గ్రామ బహిష్కరణ, సహాయ నిరాకరణ 
  4. పోలీస్‌స్టేషన్లకు పంచాయితీలు

నిర్మల్, జూలై ౨౯ (విజయక్రాంతి): ప్రజాస్వామ్యయుతంగా సర్పంచిని, పాలకవర్గాన్ని ఎన్నుకుంటున్నా గ్రామాల్లో విలేజ్ డెవలప్‌మెంట్ కమిటీ (వీడీసీ)ల అరాచక పెత్తనం సాగుతున్నది. తాము చెప్పిందే వేదం అన్న తరహాలో గ్రామాల్లో చేసుకొంటున్న తీర్మానాలు పేదలకు శాపంగా మారుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై సర్వత్ర విమర్శలు వస్తున్నాయి.

నిర్మల్ జిల్లాలో గ్రామ అభివృద్ధి కమిటీల పేరుతో సమాంతర పాలన నిర్వహిస్తూ సామాన్య జనంపై ఉక్కు పాదం మోపుతుండటంతో శాంతి భద్రతలను విఘాతం కటుగుతుంది. అన్యాయానికి గురైనపుడు న్యాయవ్యవస్థను కాదని తాము ఇచ్చిన తీర్పులకు కట్టుబడేలా చేస్తున్నారు. దిక్కరిస్తే గ్రామంలో సామాజిక బహిష్కరణ, సహాయ నిరాకరణ చేసి మానసిక కోభకు గురి చేస్తున్నారని బాధితులు ఫిర్యాదులు చేస్తునారు. 

నిర్మల్ జిల్లాలో ౩౦౦ వీడీసీలు

నిర్మల జిల్లాలో మొత్తం 396 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 624 ఆవాసాలు ఉండగా, మెజారిటీ గ్రామాల్లో గ్రామ అభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేసుకొన్నారు. ప్రజల మేలు కోసం ఈ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు గామస్థులు చెప్తున్నా.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని సమాంతర పాలన చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో 396 గ్రామపంచాయతీలకు గాను 300 గ్రామాల్లో వీడీసీలను ఏర్పాటు చేసుకొన్నట్టు తెలుస్తుంది. గ్రామంలో అన్ని కులాల నుంచి ఇద్దరు చొప్పున పెద్ద మనుషులను ఎన్నుకొని గామ అభివృద్ది కమిటీని ఏర్పాటు చేసుకొంటున్నారు. దీనికి చైర్మన్, కోశాధికారి ఇతర సభ్యులను నియమించుకొంటున్నారు. 

పెత్తనం వారిదే

గ్రామాల అభివృద్ధి కోసమని చెప్తూ ఏర్పాటుచేసుకుంటున్న వీడీసీలు గామాల్లో పెత్తనం చలాయిస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. గ్రామంలో సర్పంచ్, ఎంపిటీసీ, గ్రామ పోలీస్ ఉన్న వారిని విస్మరిస్తూ తీర్మానాల పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని మాట వినని వారిపై చర్యలు తీసుకొవడంపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా గామాల్లో బెట్లు, కల్లు, చిల్లర వ్యాపారాలకు వేలం పాటలు నిర్వహిస్తున్నారు. వీడీసీలు వేలం పాట ద్వారా ఎవరు ఎక్కువ పాట నిర్వహిస్తే వారికి అనుమతులు ఇస్తు వచ్చిన డబ్బులను గ్రామాల అభివృద్ధి పేరుతో దుర్వినిమోగం చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇసక క్వారి వ్యాపారాల్లోనూ తలదూరుస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. పెద్దల మాట వినకుంటే కుల, గ్రామ, సహాయ బహిష్కరణ చేస్తు మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. జరిమానాలు విధిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నా.. వారు కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేయడంతో గామాల్లో ఇటువంటి ఘటనలు పదేపదే జరుగుతున్నాయి.  

ఇటీవల కొన్ని ఘటనలు..

  1. సోన్ మండలంలోని సిద్దులకుంటలో ఇటీవల ఓ భూవివాదం కారణంగా కుటుంబాన్ని వీడీసీ బహిష్కరించింది. బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసి, మానవహక్కుల సంఘం, కోర్టు ద్వారా న్యాయం కోసం పోరాడారు.
  2. తానూర్ మండలం మహాలింగి గ్రామం లో కల్లు దుకాణం విషయంలో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదులు చేసుకొన్నారు.
  3. కడెం మండలంలోని ఓ గ్రామంలో వీడీసీ మాట విననందుకు ఆ కుటుంబానికి గ్రా మస్థులు సహకరించవద్దని తీర్మానం చేశా రు. బాధితులు కలెక్టర్‌కు ఫిర్యాదుచేశారు.
  4. స్వర్ణ, గోదావరి, పెంబీ తదితర నదుల్లో ఇసుకకు వేలం వేసి లక్షలాది రేపాయలు వసూలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. 
  5. లక్ష్మణచాందలోని రోడ్డుపై ఉన్న గ్రామంలో దుకాణాలకు ఏటా వీడిసీ వేలం పాట నిర్వహించింది. 

చర్యలు తీసుకొంటాం 

జిల్లాలో కొన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసుకొన్న గ్రామ అభివృద్ధి కమిటీలు చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. ప్రజా ఫిర్యాదుల విభాగంలో అన్యాయానికి గురైన వారు న్యాయం కోసం ఆశ్రయిస్తున్నారు. వీడీసీలకు ఎలాంటి హక్కు లు లేవు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని నిర్ణయాలు చేస్తే చర్యలు తీసుకోనేలా పోలీసులను ఆదేశించినం. గ్రామాల అభివృద్ధికి ఈ కమిటీలు ఏర్పాటు చేసుకోవడం మంచిదే. కానీ, ప్రభుత్వ అభివృద్ధి పనలుకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు. బాధితులు నిర్భయంగా ఫిర్యాదులు చేయాలి. తప్పకుండా న్యాయం జరిపిస్తాం.

 పైజాన్ అహ్మాద్, 

అదనపు కలెక్టర్, నిర్మల్