ప్రత్యామ్నాయ పంటలేయాలి
- వరికి బదులుగా పప్పు, చిరుధాన్యాలు సాగుచేయాలి
- ఎల్‌నినో ప్రభావంపై మూడు దశల్లో కంటింజెన్సీ ప్లాన్
- వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
సంగారెడ్డి, జూలై 13 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలను ముందుగానే అంచనా వేసి, రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా శాస్త్రీయ ప్రణాళికతో ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, నూనెగింజలు, వేరుశనగ, పెసలు, మినుములు, కందులు, సజ్జలు, జొన్న పంటలను పండించాలని రైతులకు సూచించారు.
ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు మూడు దశల్లో కంటింజెన్సీ ప్లాన్ అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. సోమవారం పటాన్‌చెరులోని ఇక్రిశాట్‌లో రాష్ట్రస్థాయి వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, నీటిపారుదల, భూగర్భ జలాలు, విద్యుత్, వాతావరణ తదితర అనుబంధ శాఖల ఉన్నతాధికారులతో ‘రాష్ట్రంలో ఎల్నినో నేపథ్యంలో కంటింజెన్సీ ప్లానింగ్’ పై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జూలై 15, జూలై 30, ఆగస్టు 15 తేదీలను ప్రామాణికంగా తీసుకుని మూడు దశల్లో కంటింజెన్సీ ప్రణాళికను అమలు చేయాలని సూచించారు. వర్షపాత పరిస్థితులను నిరంతరం సమీక్షిస్తూ ప్రతి జిల్లాకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని రైతులకు ముందస్తుగా పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. వాతావరణ మార్పులు వ్యవసాయ రంగానికి సవాలుగా మారిన నేపథ్యంలో శాస్త్రీయ వ్యవసాయ విధానాలను అనుసరించాలని తెలిపారు. వర్షాలు ఆలస్యమైనా లేదా తక్కువగా కురిసినా రైతులు ఇబ్బందులు పడకుండా వరికి బదులుగా పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, నూనెగింజలు, వేరుశనగ, పెసలు, మినుములు, కందులు, సజ్జలు, జొన్నలు వంటి తక్కువ నీటి అవసరమయ్యే ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు.
అలాగే తక్కువ కాల వ్యవధిలో దిగుబడి ఇచ్చే స్వల్పకాలిక విత్తనాలను అందుబాటులో ఉంచాలని, విత్తనాల సరఫరాలో ఎలాంటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఇక్రిశాట్, భారత వాతావరణ శాఖ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఉద్యాన విశ్వవిద్యాలయం, ఐసీఏఆర్, ఐఐఓఆర్, ఐఐఎంఆర్ తదితర సంస్థల శాస్త్రవేత్తలు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎల్‌నినో ప్రభావం, వర్షపాతం అంచనాలు, పంటలపై ప్రభావం, తేమ సంరక్షణ, సూక్ష్మ నీటిపారుదల, పంటల వైవిధ్యీకరణ, వాతావరణ ఆధారిత వ్యవసాయంపై వివరించారు.






